‘శేఖర్’ మూవీ వివాదంలో జీవితా రాజశేఖర్‌దే గెలుపు.. న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Monday,May 23 2022]
యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన మూవీ శేఖర్. ఆయన కెరీర్‌లో ఇది 91వ సినిమా. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే కూడా అందించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించడం విశేషం.
అయితే.. ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జీవితా రాజశేఖర్ తన వద్ద రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్నారని పరంధామ రెడ్డి కోర్టుకెక్కాడు. సినిమా విడుదల సందర్భంగా బాకీ తీరుస్తామని మాట ఇచ్చారని... కానీ తనకు రావాల్సిన మొత్తాన్ని జీవితా రాజశేఖర్ చెల్లించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ... జీవితా రాజశేఖర్ 48 గంటల్లోగా రూ. 65 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద కోర్టులో సమర్ఫించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించినా డబ్బు చెల్లించకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో డాక్టర్ రాజశేఖర్ దంపతులు ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం తమ కుటుంబం ఎంతగానో కష్టపడిందని పేర్కొన్నారు. కొందరు కుట్రలు చేసి సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారని రాజశేఖర్ ఆదివారం సంచలన పోస్ట్ చేశారు.
అయితే తాజా వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం పైచేయి సాధించినట్లుగా తెలుస్తోంది. వీరికి అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారని... అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని సమాచారం. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం వుంది.