వైసీపీ ప్రభుత్వంపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష ఆరోగ్య కార్యక్రమంలో పాల్గొన్న జేడీ మాట్లాడుతూ.." వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు కార్యక్రమం చక్కగా అమలవుతోంది. ఈ స్కూలు చూడండి ఎంత అందంగా కనిపిస్తోంది. నేను చదువుకున్న పాఠశాలలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, పిల్లలకు మంచి ఆహారం అందించడం అందులో రాగి జావను చేర్చడం అభినందనీయం. పోషకాహారం అందించడం ప్రభుత్వం బాధ్యత. దాన్ని విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు" అని తెలిపారు.
"సాధారణంగా హెల్త్ క్యాంపులు ఒక రోజులో ముగిస్తారు. కానీ జగనన్న ఆరోగ్య సురక్ష మాత్రం ఇందుకు భిన్నమైనది. సహజంగా ఆరోగ్య కార్యక్రమాలకు రావాలంటూ ప్రజలను పిలుస్తుంటారు. అయితే వైద్యులే ప్రజల ఇళ్ల వద్దకు వస్తున్నారు. దాదాపు 9 వేల మందిని పరీక్షించ వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నాయో గుర్తించి ఈ క్యాంపుకు పిలుస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని మనమందరం నిజంగా అభినందించాలి" అని లక్ష్మీనారాయణ కొనియాడారు.
కాగా సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అధికారిగా వీవీ లక్ష్మీనారాయణ వ్యవహరించారు. అప్పట్లో ఆయన సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. జగన్ జైలుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఉద్యోగ విరమణ చేశాక ఆయన రాజకీయాలపై మక్కువతో జనసేన పార్టీలో చేరారు. 2018లో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున లేదా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించడంతో ఆయన వైసీపీలో చేరతారా అనే ప్రచారం జోరందుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments