JD Lakshminarayana:ఏపీలో మరో కొత్త పార్టీ.. జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల వేడి ముగింపునకు వచ్చిందో లేదో ఏపీలో ఎన్నికల కాక మొదలుకానుంది. ఇప్పటికే వైసీపీ నాయకులు సామాజిక సాధికార యాత్రల పేరుతో బస్సు యాత్ర చేస్తూ ఉండగా.. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక జనసేన కూడా పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచనుంది. ఇప్పుడు రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకానుంది. దీంతో వచ్చే ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.
గత కొంత కాలంగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడతారని వదంతులు వస్తున్నాయి. తాజాగా ఈ వదంతులపై ఆయన స్పందించారు. తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చే యువతను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విశాఖ నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు మంచి ప్రచారం లభించిందని.. ఆమె కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉందన్నారు. కొంతమందే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను ఆమె చెరిపేశారన్నారు. ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
డిసెంబర్ 2న జేడీ ఫౌండేషన్, నైపుణ్య అభివృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయని.. సెలెక్ట్ అయిన వారికి అక్కడే ఆఫర్ లెటర్లు కూడా ఇస్తామని చెప్పారు. కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. కాగా గతంలో జేడీ.. పలు సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందని చెప్పడంతో అందులో ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments