JD Lakshminarayana:బర్రెలక్క పోరాటానికి జేడీ లక్ష్మీనారాయణ ఫిదా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో మార్మోగిన పేరు బర్రెలక్క అలియాస్ శిరీష. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయినా ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. డబ్బుతో ముడిపడి ఉన్న నేటి రాజకీయాల్లో ఓ ఆశాకిరణంగా బర్రెలక్క నిలిచారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా ఆమె పోరాడిన తీరు అభనందనీయం. అందుకే ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే ప్రముఖులు కూడా బర్రెలక్కకు పరోక్షంగా తమ మద్దతు తెలియజేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమెపై దాడి జరిగినప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దానిని ఖండించారు. ఆమెకు సరైన భద్రత కల్పించాలని పోలీసులను కోరుతూ ట్వీట్ చేశారు. తాజాగా ఫలితాల వెల్లడి అనంతరం బర్రెలక్కను ఆయన నేరుగా కలిశారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచిన ఆమె పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం అని ఆయన కొనియాడారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సామాన్య వ్యక్తి డబ్బులు పంచకుండా 5వేలకు పైగా ఓట్లు సాధించడం అంటే మామాలు విషయం కాదన్నారు. అలాగే తన పోరాటాన్ని మెచ్చి పెద్ద మనసుతో అభినందించిన ఆయనకు బర్రెలక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జేడీ లక్ష్మీనారాయణనే కాకుండా మరికొంతమంది ప్రముఖులు కూడా బర్రెలక్క పోరాటాన్ని కొనియాడుతున్నారు. ఆమె పోరాటంతో యువత రాజకీయాల్లో రావాలని ఆకాంక్షిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కూడా బర్రెలక్కకు పడిన ఓట్లపై స్పందిస్తూ ఆమె సాధించిన 5,754 అనేవి ఓట్లు కావు.. డబ్బుతో ఎవరినైనా కొనగలం అనే మదానికి తూడిచిన తూట్లు అని తెలిపారు. మద్యం మత్తుని, బిర్యానీ బలహీనతని, డబ్బు అనే అవసరాన్ని కలిపి పెత్తందార్లు నింపేసిన చిమ్మ చీకట్లని ఛేదించుకుంటూ ప్రజాస్వామ్య ఆకాశంలో పొడిచిన తొలి పొద్దు.. పోరాటాలన్ని గెలుపు కోసం కాదు.. ఒకసారి పోరాటమే గెలుపు అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మార్పు రావాలని పరితపిస్తుంటారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ప్రస్తుతం డబ్బుతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని పిలుపునిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ పార్టీ కూడా పెడతానని ఇటీవల ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయిన శిరీష్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డబ్బు, మద్యం పంచకపోయినా సరే తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన తనకు దాదాపు 6వేల ఓట్లు పడటం అంటే నైతికంగా గెలిచినట్లేనని తెలిపారు. ప్రజలు తనను నమ్మి స్వచ్ఛందంగా వేసిన ఓట్ల ధీమాతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబనర్ ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు బర్రెలక్కను జేడీ కలవడంతో ఆయన పెట్టే పార్టీలో ఆమె చేరి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేఉ. మొత్తానికి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే బర్రెలక్క పోరాటం విజయవంతం కావాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments