JD Lakshminarayana:జేడీ లక్ష్మీనారాయణ.. మరో జేపీ అవుతారా..? కేజ్రీవాల్ అవుతారా..?

  • IndiaGlitz, [Saturday,December 23 2023]

ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించడం సులభం. కానీ ఆ పార్టీని విజయవంతంగా నడిపించాలంటే సరైన నాయకత్వం, ఓపిక ఉండాలి. ప్రస్తుత కాలంలో పార్టీని నడపాలంటే ఆషామాషీ కాదు. ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (VV Laxminarayana) కొత్త రాజకీయ పార్టీని ప్రకటించి ఆశ్చర్చపరించారు. పార్టీ పేరును జై భారత్‌ నేషనల్‌ పార్టీ(Jai Bharath National Party)గా వెల్లడించారు. అయితే కొత్త పార్టీ పెట్టినంత మాత్రాన జనం ఆదరిస్తారా ? ఎన్నికల్లో ఓటు వేస్తారా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే మహా మహా నేతలే రాజకీయ పార్టీలను నడిపించలేక ఇతర పార్టీల్లో విలీనం చేసిన పరిస్థితులు చూశాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నడపాలంటే బలమైన ఆర్థిక, అంగబలం ఉండాలి. నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. బలమైన నేతలను ఎన్నికల్లో నిలబెట్టాలి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు ఆర్థిక బలంతో పాటు గ్రామస్థాయిలో కేడర్ కూడా ఉంది. వీటితో పాటు ఇటీవల బలంగా పుంజుకుంటున్న జనసేన, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఈ పార్టీలను కాదని జై భారత్ నేషనల్ పార్టీ వైపు నిలబడతారా..? మాజీ ఐపీఎస్ అధికారిగా లక్ష్మీనారాయణను అభిమానించే వారంతా ఓట్లు వేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే సినిమా స్టార్‌ హీరోలుగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కల్యాణ్‌.. జనసేన పార్టీని స్థాపించి పదేళ్లు అవుతున్నా ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ కల్యాణే ఓడిపోయారు. ఎంతో కష్టంతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రస్తుత రాజకీయాలు తట్టుకోలేక విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా సొంత పార్టీలు పెట్టి కనుమరుగైనవారు ఉన్నారు. వీరిలో జయప్రకాశ్ నారాయణ లోక్ సత్తా పార్టీ పెట్టి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ప్రజలు ఆ పార్టీని పట్టించుకోలేదు.

ఇటీవలే తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సిర్పూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న కేజ్రీవాల్ మాత్రమే పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు ఎంపికయ్యారు. అలాగే పంజాబ్ రాష్ట్రంలోనూ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాంటిది ప్రస్తుతం ఆయన కూడా లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ నోటీసులు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీని ఎంతవరకు నడపగలరో అన్న చర్చ మొదలైంది.