JD Lakshminarayana: కొత్త పార్టీ ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పార్టీ పేరు ఏంటంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పడింది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. తన పార్టీ పేరును జై భారత్ నేషనల్ పార్టీ అని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా తేవడం కోసమే తమ పార్టీ పుట్టిందన్నారు. సుపరిపాలన అందించడమే కాకుండా అవినీతిని అంతమొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. తాము తప్పు చేయం.. అప్పు చేయమని స్పష్టంచేశారు. చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికి వచ్చిందే జై భారత్ నేషనల్ పార్టీ అని జేడీ వెల్లడించారు. రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ప్రజల్లోంచి పుట్టుకొచ్చింది తమ పార్టీ అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. రాజకీయాలు అంటే సుపరిపాలన అని చెప్పడమే జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగానికి అసలు కారణం ప్రత్యేక హోదా రాకపోవడమే అని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై ప్రశ్నించే ధైర్యం రాష్ట్రం ఎవరికీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు ఎవరికీ బానిసలు కాదని, మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. మధ్యలో లక్ష్మీ నారాయణ పిడికిలి బిగించినట్లు ముద్రించారు.
ఐపీఎస్ అధికారిగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా లక్ష్మీ నారాయణ సేవలు అందించారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో జనసేన పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో అభిప్రాయభేదాలు వచ్చిన కారణంగా జనసేనకు రాజీనామా చేశారు. కొంతకాలం రైతు, ప్రజా సమస్యలు, యువత రాజకీయాల్లోకి రావాలనే అంశాలపై అవగాహన కల్పించారు. తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments