ఓటర్లపై నోరు జారిన జేసీ దివాకర్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా.. ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటారు. సామాన్యుడు మొదలుకుని సీఎం చంద్రబాబు వరకు ఎవరి గురించైనా సరే మాట్లాడాలనుకుంటే చాలు.. తోచింది అనేస్తుంటారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై తాజాగా జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.50 కోట్లు ఖర్చు పెట్టారని.. మొత్తం అన్ని పార్టీలూ కలిసి రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాయని వ్యాఖ్యానించారు.
నోరు జారిన జేసీ...
అంతటితో ఆగని ఆయన అవినీతి సొమ్మును అన్ని పార్టీల అభ్యర్థులూ ఖర్చు పెట్టారని అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు మేధావులను కలుపుకొని ముందుకు వెళ్తానని.. వచ్చే ఐదేళ్లలో కచ్చితంగా ఎన్నికల ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్నారు. అంతేకాదు.. డబ్బులు పంచనిదే ఓట్లు వేయడం లేదని.. తిండికి లేని వాళ్లు కూడా ఓటుకు ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారని జేసీ నోరు జారి ఓటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను నియోజకవర్గంలో ఓటుకు రెండు వేలు పంచానని ఆయన ఒప్పుకున్నారు. తన కుమారుడు పోటీ చేసిన నియోజకవర్గంలో మొత్తం రూ.50 కోట్లు ఖర్చు చేశామని స్వయానే జేసీనే చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు కంగుతిన్నారు.
పసుపు కుంకుమపై...
చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని జేసీ జోస్యం చెప్పారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛన్లు.. తమకు ఓట్లు తెచ్చిపెడతాయన్నారు. చివరి రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలే టీడీపీని గట్టెక్కించనున్నాయని జేసీ చెప్పుకొచ్చారు. రైతుల కోసం బాబు శ్రమిస్తే ఒక్కడైనా ఆయనను అభినందించాడా? అని ఆయన ప్రశ్నించారు. అయితే జేసీ చేసిన వ్యాఖ్యలపై మేథావులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే జేసీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments