‘కడప రాజధానిగా గ్రేటర్ రాయలసీమ కావాలి’
- IndiaGlitz, [Friday,January 10 2020]
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆయన కుమారుడు నారా లోకేష్ రంగంలోకి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. ఈ క్రమంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతే లేకుంటే కడపే!
‘రాజధానిగా అమరావతే మాకు ఆమోద యోగ్యం. రాజధానిని విశాఖకు మారిస్తే సీమ జిల్లాలు (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) నెల్లూరు, ప్రకాశంతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలి. కడపను రాజధానిగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలి. అలా చేసే వరకూ మేం ఉద్యమిస్తాం. సంక్రాంతి తర్వాత ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాం. విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగతా జిల్లాల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు. జగన్ ఇకనైనా రాజధాని మార్పు నిర్ణయాన్ని మార్చుకోవాలి’ అని జేసీ దివాకర్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
ఇలా చేస్తే ఎలా!
ఇదిలా ఉంటే.. జగన్‌పై మరోసారి తనదైన శైలిలో జేసీ విమర్శలు గుప్పించారు. వైఎస్సార్ తరహాలో జగన్ కూడా పాలన సాగిస్తారని 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేస్తే.. ఆయన ప్రజల్లో ఆ నమ్మకాన్ని నిలుపుకోలేకపోతున్నారన్నారు. ఎంతసేపూ తాను పట్టిను కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించడం మంచిది కాదని జేసీ హితవు పలికారు.
దొనకొండే రాజధాని..!
ఇదిలా ఉంటే.. ప్రకాశం జిల్లాలోని దొనకొండను ఏపీ రాజధానిగా ప్రకటించాలన్న పాత డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతి నుంచి రాజధానిని మార్చాల్సి వస్తే దొనకొండలో ఏర్పాటు చేయాలని మ్మార్సీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దొనకొండ రాయలసీమకు కూడా దగ్గర ప్రాంతమని.. అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ రాజధానిపై హైపవర్ కమిటి రెండో రోజు సమావేశమైంది. మరి ఫైనల్‌గా రెండు మూడ్రోజుల్లో సంచలన ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ మనసులో ఏముందో ఎలాంటి ప్రకటన చేస్తారో అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.