వైసీపీ కండువా కప్పుకున్న జయసుధ
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి, టీడీపీ మహిళా నేత జయసుధ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో గురువారం రోజున జయసుధ, ఆమె కుమారుడు పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ సాయంత్రం లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లిన జయసుధ సుమారు అరగంటపాటు అధినేతతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. కాగా వరుసగా కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలోకి క్యూ కడుతుండటంతో జయసుధ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసి ఫ్యాన్ గూటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే కారణమన్నారు. మళ్లీ జగన్ పార్టీలో చేరడంతో సొంతింటికి వచ్చినట్టుందన్నారు. ఎక్కడ్నుంచి పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని జయసుధ స్పష్టం చేశారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీకోసం పనిచేస్తానని ఆమె చెప్పారు. పార్టీ బలోపేతానికి సాయశక్తులా కృషిచేస్తామన్నారు.
కాగా.. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరగేంట్రం చేసిన ఆమె.. సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి ఒకసారి గెలుపొందారు. ఈమెపై ప్రస్తుత తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అప్పట్లో టీడీపీ తరఫున పోటీచేశారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆమె.. పార్టీ కార్యక్రమాల్లో ఏ రోజూ చురుగ్గా పాల్గొన్న దాఖలాల్లేవ్. అయితే కుమారుడ్ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తర్వాత టీఆర్ఎస్... సీఎం కేసీఆర్‌కు బాగా దగ్గరయ్యారు. కాగా.. సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్ 17న మద్రాస్‌లో జన్మించిన ఆమె అక్కడే పుట్టి పెరిగారు. ఈమె మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల (కృష్ణ) ఈవిడకు మేనత్త అనే విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments