సింగర్ గా మారిన నటుడు జయప్రకాష్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, క‌మెడియ‌న్‌గా 300 సినిమాల‌కు పైగా న‌టించిన న‌టుడు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ఇప్పుడు గాయ‌కుడుగా మారారు. త‌న శివ భ‌క్తిని చాటుకుంటూ శివ ప్ర‌కాశం అనే గీతాల‌ను ఆల‌పించిన ఆల్బ‌మ్‌ను మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

తొలి ఆడియో సీడీని ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం విడుద‌ల చేసి తొలి సీడీని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌కు అందించారు. తాను సినిమా రంగంలోకి రాక ముందు ఉపాధ్యాయుడుగా ప‌నిచేశాన‌ని, పిల్ల‌ల‌కు నాట‌కాలు వేసేట‌ప్పుడు శిక్ష‌ణ ఇచ్చేవాడిని, కొన్ని సంద‌ర్భాలలో నేప‌థ్య గీతాలు కూడా పాడాను. ఆ అనుభ‌వంతో నా భ‌క్తిని తెలియ‌జేసేలా, నాకు న‌చ్చిన విధంగా శివ భ‌క్తిని తెలియ‌జేసేలా పాట‌లు పాడాల‌ని నిర్ణయం తీసుకున్నాను. అందుకోసం జొన్న‌విత్తుల గారిని క‌లిసి నా కోరికను తెలియ‌జేసిన‌ప్పుడు ఆయ‌న వాడుక ప‌దాల‌నుప‌యోగించి శివుని అద్భుత‌మైన పాట‌ల‌ను రాశారు. అలాగే వీణాపాణిగారు వాటికి చ‌క్క‌టి సంగీతానందించారని జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి అన్నారు.

శివుడు అంటే ఆది గురువు..స్వ‌యం శ‌క్తి. అటువంటి శివుడుకి భ‌క్తే ముఖ్యం. ప‌రిశుద్ధ‌మైన భ‌క్తితో పూజిస్తే ఎలాగైనా ఆయ‌న ప‌లుకుతాడు. అందుకు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డిగారు త‌న అపార భ‌క్తిని త‌న‌కు తోచిన విధంగా గీతాలాప‌న మార్గంలో చేశారు. జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డిగారికి వీణాపాణిగారు, జొన్న‌విత్తులగారు త‌మ వంతు స‌హకారాన్ని అందించారు. జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డికి ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌, నిర్మాత డి.సురేష్‌బాబు, ద‌ర్శ‌కుడు ధ‌వ‌ళ స‌త్యం ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు.