Janasena:400 కోట్లు దోచుకున్నారు.. 40 మంది చనిపోయారు, ఆదుకోండి : పవన్‌కు జయలక్ష్మీ బ్యాంక్ బాధితుల వినతి
Send us your feedback to audioarticles@vaarta.com
పిఠాపురంలో పవన్ కల్యాణ్ నిర్వహించిన జనవాణి - జనసేన భరోసాకు సమస్యల వెల్లువెత్తాయి. రైతులు, యువత, మత్స్యకారులు, దివ్యాంగులు, భిన్న వర్గాల ప్రజల ఆవేదనలను తెలుసుకున్నారు జనసేనాని. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు జడివానలా వెల్లువెత్తాయి. పిఠాపురం నియోజకవర్గ పరిసరాల నుంచి వివిధ సమస్యలపై 34 మంది అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో కష్టాన్ని పవన్ కల్యాణ్‌కు చెప్పుకున్నారు.
ముఖ్యమంత్రే హ్యాండ్ ఇచ్చారు :
జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు పేరిట డిపాజిట్లు సేకరించి రూ. 480 కోట్లు దోచుకున్నారని ఆ బ్యాంక్ బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. 20 వేల మంది ఖతాదారులు మోసపోయారని, అందరికీ జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. స్వయానా ముఖ్యమంత్రి దృష్టికి సమస్య తీసుకువెళ్లినా ఉపయోగం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారంతా రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులేనని తెలిపారు. తమ పోరాటానికి జనసేన మద్దతు తెలిపితే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. జయలక్ష్మి బ్యాంక్ బాధితులు ఒత్తిడితో ఇప్పటికే 40 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరికొంతమంది ఆరోగ్యం పాడైందని బాధితులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. చివరికి చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో చందాలు వేసుకుని వైద్య సాయం చేస్తున్నామని వారు వాపోయారు. ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని.. తమకు న్యాయం చేయాలంటూ జయలక్ష్మి బ్యాంక్ ఖాతాదారులు అర్జీలో పేర్కొన్నారు.
పిచ్చిదని ముద్ర వేసి ఆస్తి లాక్కుంటున్నారు :
మంత్రి దాడిశెట్టి రాజా పీఏ భూమి ఆక్రమించుకున్నారని పోరాటం చేస్తున్న ఆరుద్ర అనే మహిళను పిచ్చిదని ముద్ర వేసి ఆసుపత్రిలో చేర్చారని దివ్యాంగులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. పిచ్చి ఉందని చెప్పి ఆస్తి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఉందని తెలిసే ఆమెని పిచ్చాసుపత్రిలో పెట్టారని.. ఆరుద్ర తల్లి చేస్తున్న పోరాటానికి మీ మద్దతు అవసరమని వారు జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు. 2016 దివ్యాంగుల చట్టాన్ని అమల్లోకి తేవాలని.. దివ్యాంగులకు రూ.10 వేల ఫించన్ ఇవ్వాలని , కానీ ప్రస్తుతం రూ.3 వేలు మాత్రమే వస్తోందన్నారు. మమ్మల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదని, వైకల్యం మాకు శాపమా..? ప్రతి వికలాంగుడికీ రేషన్ కార్డు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలని దివ్యాంగులు తమ సమస్యలు పవన్ కళ్యాణ్ ఎదుట ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, జనవాణి సమన్వయకర్త డి.వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout