Download App

Jayadev Review

సినిమా రంగం అంటే ఆస‌క్తి ఉండ‌నివారు అరుదుగానే ఉంటారు. వీలుంటే సినిమాల్లోతాము కానీ త‌మ వార‌సులు కానీ రాణించాల‌ని కోరుకుంటూ ఉంటారు. అలా ఆస‌క్తి చూపిన వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు త‌న‌యుడు గంటా ర‌వి ఒక‌రు. సినిమా రంగంలోకి రావాల‌నుకోగానే ఏదో వ‌చ్చేయాల‌ని కాకుండా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌తో పోలీసుల ముందుకు రావాల‌నుకున్నాడు. అందులో భాగంగా ర‌వి చేసిన ప్ర‌య‌త్నం `జ‌య‌దేవ్‌`. త‌మిళ సినిమా రీమేక్‌గా రూపొందిన `జ‌య‌దేవ్` ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుంది, గంటా ర‌వి పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉంది త‌దిత‌ర విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా క‌థలోకి ఓ లుక్కేద్దాం..

క‌థ:

సింహాద్రిపురం, దోస‌ల‌పాడు గ్రామాలను త‌న ఆక్ర‌మ వ్యాపారాల‌తో దోచేస్తుంటాడు మ‌స్తాన్ రాజు(వినోద్ కుమార్‌). త‌న‌కు అడ్డువ‌చ్చిన వారిని చంపేస్తుంటాడు. అదే స‌మ‌యంలో సింహాద్రిపురం సిఐగా జాయిన్ అవుతాడు జ‌య‌దేవ్‌(గంటా ర‌వి). త‌ను చాలా నిజాయితీ ప‌రుడు. న్యాయం కోసం ఎవ‌రితోనైనా పోరాడే వ్య‌క్తి.  మ‌స్తాన్ రాజు అక్ర‌మ వ్యాప‌రాల‌పై దోస‌ల‌పాడు ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీహ‌రి(ర‌విప్ర‌కాష్‌) ఓ ఫైల్ త‌యారు చేస్తాడు. ఆ విష‌యం తెలుసుకున్న మ‌స్తాన్ రాజు శ్రీహ‌రిని త‌న మ‌నుషుల‌తో చంపేస్తాడు. కేసు సింహాద్రిపురం ప‌రిధిలోకి రావ‌డంతో జ‌య‌దేవ్ రంగంలోకి దిగుతాడు. హ‌త్య వెన‌కున్న‌ది మ‌స్తాన్ రాజు అని తెలుసుకున్న జ‌య‌దేవ్, సాక్ష్యాధారాల‌ను సేక‌రించే ప‌నిలో బిజీ అవుతాడు. దీంతో జ‌య‌దేవ్‌, మ‌స్తాన్ రాజుల మ‌ధ్య పోరు జ‌రుగుతుంది. చివ‌రికి ఈ పోరులో ఎవ‌రు స‌క్సెస్ అవుతారు? జ‌య‌దేవ్ చివ‌ర‌కు మ‌స్తాన్ రాజును ఎలా శిక్షిస్తాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష:

ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా.., శంక‌ర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన జ‌యంత్ ద‌ర్శ‌కుడిగా క‌థ‌లో వీలైనంత కొత్త‌ద‌నం తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడు. త‌మిళ మాతృక‌లోని క‌థ‌ను అలాగే దించేయ‌కుండా చాలా వ‌ర‌కు మెయిన్ పాయింట్, కొన్ని సీన్స్ ను తీసుకుని క‌థా గ‌మ‌నాన్ని మార్చుకుంటూ వ‌చ్చాడు. అయితే క‌థ‌లో మ‌లుపులను ఆస‌క్తి క‌రంగా తెర‌కెక్కించ‌లేక‌పోయాడు. గంటా ర‌వి కొత్త హీరో కాబ‌ట్టి త‌న నుండి అద్భుతాల‌ను ఆశించ‌డం అత్యాశే అవుతుంది. పాత్ర ప‌రంగా త‌ను ఓకే అనిపించుకున్నాడు. కానీ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ అన‌గానే క్యారెక్ట‌ర్లో ఇన్‌టెన్ష‌న్ ఉంటుంది. దాన్ని రాబ‌ట్టుకోవ‌డం ద‌ర్శ‌కుడి ఫెయిల్యూర్ మ‌న‌కు తెర‌పై క‌న‌ప‌డింది. గంటా రవి ఫైట్స ప‌రంగా ఓకే, కానీ డ్యాన్సులు ప‌రంగా ఇంకా బాగా చేయాలి. డ్యాన్సులు చేసేట‌ప్పుడు ఫ్రీజ్ అయిపోతున్నాడు. హీరోయిన్ మాళ‌విక రాజ్ గ్లామ‌ర్ ప‌రంగా బావుంది. త‌ను పాట‌ల‌కే ప‌రిమితం అయ్యింది. వినోద్ కుమార్ విల‌నిజం తెచ్చి పెట్టుకున్న‌ట్లు క‌న‌ప‌డింది. పోసాని కృష్ణ‌ముర‌ళి, శివరెడ్డి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, శ్ర‌వ‌ణ్‌, సుప్రీత్ ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సినిమాలో పోలీసుల బాధ్య‌త‌ల‌ను వారెలా నిర్వ‌ర్తిస్తున్నారో, స‌మాజానికి వారెంత సేవ చేస్తున్నార‌నే విష‌యాన్ని ఒక పాట‌లో చ‌క్క‌గా చూపించారు. ఫేస్ గుడ్డ క‌ట్టుకుని చేసే ఫైట్, విల‌న్స్ హీరో ఇంటిపై దాడికి వ‌చ్చిన‌ప్పుడు చిన్న‌పిల్లాడు గ‌న్ తీసి కాల్చే సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. మ‌ణిశ‌ర్మ పాటలు బావున్నాయి. పిక్చ‌రైజేష‌న్‌, లోకేష‌న్స్ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. కానీ సీరియ‌స్ సాగిపోతున్న క‌థ మ‌ధ్య‌లో పాట‌ల‌ను ఇరికించ‌డం, అసంద‌ర్భంగా పాట‌లు రావ‌డం బాలేదు. ఇక హీరో హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ సీన్స్ స‌రిగ్గా పండ‌లేదు.సినిమాటోగ్ర‌ఫీ బావుంది.  హీరో అసంద‌ర్భంగా కోపం చూపే కొన్ని సీన్ బాలేదు. స‌త్తి కామెడి న‌వ్వించ‌లేదు. వెన్నెల‌కిషోర్‌, హ‌రితేజ కామెడి ట్రాక్ బావుంది. మొత్తం మీద ర‌వి లాంటి డెబ్యూ హీరో ఇంత హెవీ స‌బ్జెక్ట్ కంటే కాస్తా తేలిక‌పాటి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఉంటే ఇంకా బావుండేదేమోన‌నిపించింది.

బోట‌మ్ లైన్: జ‌య‌దేవ్‌..మెప్పించ‌లేదు

Jayadev English Version Review

Rating : 2.5 / 5.0