మెగా హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలనుకుంటున్న హీరోల్లో సాయిధరమ్..తిక్క, విన్నర్ చిత్రాలతో కాస్త వెనకడుగు వేశాడు. ఈ సినిమాల పరాజయాలను మళ్లీ విజయాలతో అధిగమించాలని ప్రయత్నాల్లో భాగమే `జవాన్` చిత్రంలో నటించడం. ఈ సినిమాకు రచయిత బి.వి.ఎస్.రవి దర్శకుడు కావడం అందరినీ ఆలోచనలోకి నెట్టింది. కారణం గతంలో ఈ రచయిత, దర్శకుడిగా మారే ప్రయత్నంలో చేసిన `వాంటెడ్` ప్లాప్ అయ్యింది. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈ `జవాన్` సినిమాను డైరెక్ట్ చేశాడు. మరి దర్శకుడుగా బి.వి.ఎస్.రవి సక్సెస్ అందుకున్నాడా? తనతో పాటు తేజుకు సక్సెస్‌ను అందించాడా? లేదా? అని తెలుసుకోవాలంటే కథలోకి ఓ లుక్కేద్దాం.
కథ:
జై(సాయిధరమ్ తేజ్), కేశవ్(ప్రసన్న) భిన్న వ్యక్తిత్వాలున్నవారు. ఈ మనసత్త్వాలతో చిన్నప్పుడే విడిపోతారు. జై దేశభక్తితో పెరిగి పెద్దవుతాడు. కేశవ హింసా ప్రవృత్తితో పెరిగి తీవ్రవాద సంస్థలతో పరిచయాలు పెంచుకుంటాడు. ఈ క్రమంలో దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే సంస్థ డి.ఆర్.డి.ఒ .. అక్టోపస్ అనే మిసైల్‌ను, దానికి సంబంధించిన ఫార్ములాను తయారు చేస్తుంది. దాన్ని కొట్టేయాలని కేశవ అండ్ గ్యాంగ్ ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అదే సమయంలో డి.ఆర్.డి.ఒ సంస్థలో ఉద్యోగం సంపాదించుకోవాలనుకునే జైకి కోటశ్రీనివాసరావు వల్ల సంస్థలో ఏదో జరుగుతుందని తెలుస్తుంది. దాంతో రంగంలోకి దిగి తన తెలివి తేటలతో కేశవ అండ్ గ్యాంగ్‌కు చెక్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాంతో కేశవ అండ్ గ్యాంగ్ జై సహా అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు జై ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- హీరో, విలన్స్ మధ్య సాగే ఆసక్తికరమైన ఘటనలు
- సినిమాటోగ్రఫీ
- డైలాగ్స్
- ప్రసన్న నటన
మైనస్ పాయింట్స్:
- కామెడి లేకపోవడం
- పాటలు సందర్భానుసారం లేకపోవడం
- నేపథ్య సంగీతం
సమీక్ష:
ఇందులో భాగంగా ముందు నటీనటులు పనితీరు విషయానికి వస్తే..సాయిధరమ్ తేజ్ ఓ బాధ్యతతో కూడిన పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు మన పక్కింటి కుర్రాడిలా నటించాడు. బరువైన డైలాగ్స్ పలకడం, హెవీ రోల్ చయడం వల్ల తేజు కాస్త కొత్తగా కనపడ్డాడు. భార్గవి అనే పెయింటర్ పాత్రలో మెహరీన్ నటించింది. కాస్త బొద్దుగా కనపడ్డ మెహరీన్ అందాల అరబోతకు ప్రాధాన్యతనిచ్చింది. పాత్ర పరంగా చూస్తే నటనకు స్కోప్ లేదు. ఇక విలన్‌గా ప్రసన్న నటన చాలా బావుంది. స్టైలిష్ విలన్‌గా కొత్త లుక్‌లో ప్రసన్న మెప్పించాడు. తెలుగులోకి ఓ కొత్త విలన్ వచ్చినట్లే. నాగబాబు, జయప్రకాష్, సత్యం రాజేష్, సుబ్బరాజు తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. కాగా సాంకేతికంగా చూస్తే దర్శకుడు రవి చెప్పాలనుకున్న నేపథ్యం కొత్తగా తీసుకున్న ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడో మిస్‌ఫైర్ అయినట్లు అనిపిస్తుంది. అందువల్ల సినిమా అంతా ఏదో హడావుడిగా, గందరగోళంగా ఉంటుంది. అయితే మైండ్ గేమ్ సన్నివేశాలను చక్కగానే రాసుకున్నాడు. ప్రధానంగా రెండు పాత్రల మధ్య జరిగే సినిమా కాబట్టి మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత కనపడదు. తమన్ సంగీతంలో బంగారు, బుగ్గ అంచున ..అనే పాటలు బావున్నాయి. వీటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం ఓకే. కె.వి.గుహన్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్‌ను ఎంతో రిచ్‌గా చూపించాడు. తన దేశాన్ని కాపాడుకోవాలనుకునే ఓ యువకుడు.. దేశ రహస్యాలను శత్రు దేశాలకు అమ్మేయాలనుకునే మరో వ్యక్తి మధ్య పోరాటం అనే కాన్సెప్ట్‌పై తెలుగులో ఎప్పటి నుండో చాలా సినిమాలు వచ్చాయి. సింపుల్‌గా చెప్పాలంటే నేను, నా కుటుంబం, నా దేశం అనుకునే కథానాయకుడికి, నేను మాత్రమే అనుకునే ప్రతి నాయకుడికి మధ్య జరిగే పోరే `జవాన్`. ఏదో అవేశంగా ఇద్దరువ్యక్తులు పొట్లాడుకోవడం కాకుండా సినిమాను మైండ్ గేమ్ స్టైల్లో తెరెకెక్కించాడు దర్శకుడు బి.వి.ఎస్.రవి. సీరియస్‌గా సాగే కథలో ప్రేమకథ అడ్డం పడుతూ వచ్చింది. అలాగే పాటలు సందర్భానుసారం లేవు. కామెడీ పెద్దగా లేదు. డి.ఆర్.డి.ఒ, మిసైల్ ఇలాంటి సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకుడికి ఏమాత్రం అర్థమవుతుందనేది చిన్నపాటి సందేహాన్ని రేకెత్తిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: కుటుంబం కోసం.. దేశం కోసం జవాన్ ఆడే మైండ్ గేమ్
Jawaan Movie Review in English
Comments