నటుడు బెన‌ర్జీకి జంధ్యాల మెమోరియ‌ల్ పురస్కారం

  • IndiaGlitz, [Wednesday,July 24 2019]

టాలీవుడ్ సీనియర్ నటుడు బెనర్జీగా పేరుగాంచిన మాగంటి వేణు బెనర్జీ.. జంధ్యాల మెమోరియ‌ల్ అవార్డ్ దక్కింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన బెనర్జీ.. న‌టుడిగా, విల‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించి తెలుగు రాష్ట్ర ప్రజల ఆదారాభిమానాలు పొందారు. సినీ పరిశ్రమలో ఆయన 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది.

కాగా.. సినీ ప‌రిశ్రమ‌కు ఆయ‌న చేసిన సేవ‌ల్ని గుర్తించి జంధ్యాల మెమోరియ‌ల్ పుర‌స్కారాన్ని అందించ‌నున్నార‌ు. ఈనెల 28న విజ‌య‌వాడ‌లో సుమ‌ధుర క‌ళానికేత‌న్స్‌ బెన‌ర్జీకి ఈ పుర‌స్కారాన్ని అందించ‌నున్నారు. విజ‌య‌వాడ‌ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో ఈ అవార్డు కార్యక్రమం జరగనుంది. ఇదిలా ఉంటే.. ‘భరత్ అనే నేను’, ‘జన‌తా గ్యారేజ్’, ‘కిక్’, ‘మ‌ల్లేశ్వరి’, ‘స‌మ‌ర్థుడు’, ‘శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌’, ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’, ‘చంటి’, ‘కిల్లర్’, ‘రక్షణ‌’, ‘గాయం’ సినిమాలతో మరెన్నో బ్లాక్ బ‌స్టర్ చిత్రాల్లో బెన‌ర్జీ అద్భుత‌మైన పాత్రల్లో న‌టించి మెప్పించారు. అంతేకాదు..మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లోనూ ప‌లు విభాగాల్లో ఆయ‌న‌ కీల‌క బాధ్యత‌లు నిర్వర్తిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈనెల 28న జ‌ర‌గ‌నున్న పుర‌స్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ప‌లు కామెడీతో పాటు.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు స్టేజీ ఆర్టిస్టులు ఈ వేదిక‌పై హాస్య ప్రధాన‌ స్కిట్‌ల‌లో పార్టిసిపెంట్ చేస్తున్నార‌ని నిర్వాహ‌కులు భాస్కర్ వెల్లడించారు.

బెనర్జీ గురించి మూడు ముక్కల్లో..!

బెనర్జీ విజయవాడలోని గవర్నరుపేటలో జన్మించాడు. ఈయన తండ్రి కూడా రాఘవయ్య నటుడు. బెనర్జీ బెజవాడలో కొండపల్లి కోటేశ్వరమ్మ స్థాపించిన మాంటిస్సోరి చిల్డ్రన్స్ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన తండ్రి సమాచార శాఖలో ఉద్యోగి కావడంతో ఆయనకు ఢిల్లీకి బదిలీ అయింది. బెనర్జీ కొద్ది రోజులు అక్కడ ఉన్నారు. గుంటూరులోని ఏ.సి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. తర్వాత మద్రాసులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, బి.ఏ చదివాడు. విజయనగరంలో ఓ కంపెనీకి బ్రాంచి మేనేజరుగా పనిచేశారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా.. ఆయనకు ఓ అక్క ఉండగా.. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన భార్య, కూతురుతో కలిసి జీవిస్తున్నారు.