Pawan Kalyan:450 ఎకరాలను అమ్మేసిన అవంతి అనుచరుడు.. మత్స్యకారులకు 10 లక్షలెక్కడ : పవన్‌కు గోడు వెళ్లబోసుకున్న బాధితులు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర విశాఖపట్నం జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వాడి వేడి విమర్శలు చేస్తూనే జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు పవన్ . నిన్న విశాఖలో జనవాణి - జనసేన భరోసా కార్యక్రమానికి వినతులు వెల్లువలా వచ్చాయి. దాదాపుగా 340 అర్జీలు పవన్ కళ్యాణ్ చెంతకు వచ్చాయి. ఈ పరిస్థితిని చూసి జనవాణి కార్యక్రమాన్ని మరో రెండు రోజుల పాటు విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించినా పూర్తికావని స్వయంగా పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపిగా వున్న ఆయన.. జనసేన అండగా నిలబడుతుందని ధైర్యాన్ని ఇచ్చారు.
450 ఎకరాల భూమిపై అవంతి అనుచరుడి కన్ను :
భీమిలి నియోజకవర్గం, భీమిలి మండలం , దాకమర్రి గ్రామాల రైతులు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు దాట్ల పెదబాబు అరాచకాలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. రేవడి రాజుల నుంచి తమ తాతలు వందల ఏళ్ల క్రితం భూములు కొన్నారని.. వీటిలో తాము వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్పారు. కానీ దాట్ల పెదబాబు.. ఆ భూములను రూ.14 కోట్లకు అమ్మేశానని అంటున్నాడని.. 450 ఎకరాలలో 600 కుటుంబాలు, 5 పంచాయతీల ప్రజలు ఈ భూముల మీదే ఆధారపడి బతుకుతున్నామని.. అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదని వారు వాపోయారు. హిడెన్ స్కౌట్స్ స్కూల్ పేరిట మానసిక వైకల్యం కలిగిన 200 మంది పిల్లల సంక్షేమాన్ని చూస్తున్నామని.. కానీ తమ భూమిపై వైసీపీ నేత వెంకట్రావు కన్నుపడిందని లీజు గడువు ముగిసిందంటూ తమను రోడ్డుపై తోసేయడంతో రోడ్డు మీదే చిన్న షెడ్డు వేసుకుని 120 మంది పిల్లలను సాకుతున్నామని నిర్వాహకులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అరకు నియోజకవర్గం అనంతగిరిలో 220 ఎకరాల గిరిజనుల భూమిని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయిచుకున్నాడి బాధితులు పేర్కొన్నారు.
రెండేళ్లుగా మా పాప కనిపించడం లేదు సార్ :
రెండేళ్లుగా మా పాప కనిపించడం లేదని కదనపేడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు దంపతులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. కాల్ ట్రేస్ చేస్తే సర్పంచ్ కొడుకుదని తేలిందని.. కారు ఇచ్చాపురంలో ట్రేస్ అయ్యిందని చెప్పారు. పోలీసుల స్పందన సరిగా లేకపోవడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశామని.. అయితే కేసు ఉపసంహరించుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు నియోజకవర్గంలో నిర్మిస్తోన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కారణంగా 32 గ్రామాలు ముంపు బారినపడతాయి. 3240 మంది నిరాశ్రయులవుతారని.. పంచాయతీ తీర్మానం, గ్రామసభ లేకుండా వెళ్లిపోమంటున్నారని బాధితులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎల్జీ పాలిమర్స్ బాధితులకు నేటీకి అందని సాయం :
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటాపురానికి చెందిన 191 మంది బాధితులు తమకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన పరిహారం అందలేదన్నారు. నాటి ఘటనలో గ్యాస్ తీవ్రతతో అవయవాలు పాడై ఇబ్బందులు పడుతున్నామని.. ఎల్జీ పాలిమర్స్ బాధితుల పేరు చెబితే స్పందనలోనూ ఫిర్యాదులు స్వీకరించడం లేదని వాపోయారు. ఇదే ఘటనలో తన కుమార్తె చనిపోయిందని దీనిపై ఆందోళన చేస్తే పోలీసులు తనపై కేసు పెట్టారని.. చేయి కూడా చేసుకున్నారని లత అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పరవాడ పారిశ్రామిక వాడ నుంచి వెలువడే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తాడి గ్రామ ప్రజలు తెలిపారు. తమ గ్రామాన్ని తరలిస్తామని 18 ఏళ్లుగా చెబుతున్నారని వారు వాపోయారు.
మత్స్యకారులకు పది లక్షల సాయం ఏది :
దువ్వాడ గ్రామంలో తనకు 84 సెంట్ల స్థలం వుందని ఈ భూమి అమ్మాలంటూ స్థానికంగా ఉండే రౌడీషీటర్ వెంకట రమణ బెదిరిస్తున్నాడని , ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలాన్ని ఆక్రమించుకున్నాడని , ఈ భూమికి గోడ కూడా కట్టేశారని శ్రీనివాసరావు అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మత్స్యకారులు వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తామని సీఎం జగన్ చెప్పారని..కానీ ఒక్కరికి కూడా పరిహారం అందలేదన్నారు. 70 మంది చనిపోతే 14 మందే మరణించినట్లుగా చూపించి, అందులోనూ నలుగురికే సాయం చేశారని మత్స్యకారులు ఆరోపించారు. డీజిల్ సబ్సిడీ, వేట విరామ సమయంలో ఆర్ధిక సాయంలోనూ మోసాలు జరుగుతున్నాయని వారు వాపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout