Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్... 24న జనవాణి రద్దు
- IndiaGlitz, [Wednesday,July 20 2022]
ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు జనసేన పార్టీ తలపెట్టిన జనవాణి జనసేన భరోసా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవాడ, భీమవరంలలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల తమ కష్టాలు, సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. జనసేన అధినేత స్వయంగా అర్జీలను స్వీకరించి.. తానున్నాననే భరోసా కల్పించారు. అయితే విజయవంతంగా సాగుతోన్న జనవాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది.
పవన్‌తో పాటు నేతలు, సిబ్బందికీ జ్వరం:
పార్టీ అధినేత పవన్ కల్యాన్ వైరల్ ఫీవర్ బారినపడటమే అందుకు కారణం. ఇటీవల గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే పవన్ వైరల్ ఫీవర్ బారినపడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అధినేతతో పాటు పలువురు ముఖ్య నాయకులు, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరం బారినపడ్డారని నాదెండ్ల తెలిపారు. దీంతో వచ్చే ఆదివారం (జూలై 24న) జరగాల్సిన జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి బదులు 31వ తేదీన నిర్వహించనున్నట్లు మనోహర్ తెలిపారు. జనవాణి నిర్వహించే స్థలం, వేదిక తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బెజవాడలో 1000 అర్జీలు.. భీమవరంలో 497 అర్జీలు :
ఇకపోతే.. రెండు విడతలుగా జరిగిన జనవాణి కార్యక్రమానికి సంబంధించి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు. విజయవాడలో జరిగిన రెండు విడతల్లో దాదాపు 1000 అర్జీలు వచ్చాయని.. భీమవరంలో 497 అర్జీలు వచ్చాయని మనోహర్ తెలిపారు. పంచాయతీ రాజ్, ఆరోగ్య, వ్యవసాయ, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖల నుంచి ఎక్కువ అర్జీలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో నెలకొన్న స్థానిక సమస్యలు, డంప్ యార్డ్ గురించి ప్రజలు అర్జీలు ఇచ్చారని నాదెండ్ల తెలిపారు. అర్జీల పరిష్కార ప్రక్రియ మొదలైందని.. వచ్చిన అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖాధిపతులకు పంపిస్తామని మనోహర్ వెల్లడించారు. వాటితో పాటు జనసేన పార్టీ తరఫున లెటర్స్ రాస్తామని, వారం రోజుల తరువాత అర్జీకి సంబంధించిన అప్ డేట్ ను సంబంధిత వ్యక్తికి మెయిల్, వాట్సప్ ద్వారా అందిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు.