నన్ను తల ఎత్తుకునేలా చేసిన శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను - ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన జనతా గ్యారేజ్ దాదాపు 75 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యథిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ సందర్భంగా జనతా గ్యారేజ్ విజయోత్సవం సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెషన్ హాల్ లో ఘనంగా జరిగింది. నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, దానయ్య, డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా జనతా గ్యారేజ్ టీమ్ మెంబర్స్ కి షీల్డ్స్ అందచేసారు.
ఈ సందర్భంగా గీత రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ... ఇది సక్సెస్ అంటే..! టీమ్ అందరం ఆనందంగా ఉన్నాం. మనస్పూర్తిగా మనం కథ చెబితే జనం చూడడానికి రెడీగా ఉన్నారు అనడానికి జనతా గ్యారేజ్ నిదర్శనం. శివ గారు ఎప్పుడూ మంచి కథ చెబుదాం అనేవారు. ప్రకృతిని గౌరవించాలి మనుషులను ప్రేమించాలి అనేది అందరికీ తెలిసిందే అయినా ఎన్టీఆర్ తో చెబితే ఎంతో మందికి రీచ్ అవుతుంది అనిపించింది అలాగే జరిగింది. ఈ చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ఉభయ రాష్ట్రాల ప్రజలకు నమస్సుమాంజలి. ఈ చిత్రం వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది పక్కన పెడితే అంతకు మించి... ఎన్నో కోట్ల హృదయాలను గెలుచుకుంది. నేను రాసిన ఈ సినిమాలోని ఆరు పాటలను ఇప్పుడు వింటుంటే ఏడుపు వచ్చినట్టు అయ్యింది. ప్రణామం, జయహో జనతా...అనే పదాలను దేవినే అందించాడు. జనతా గ్యారేజ్ కి విజయాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు అన్నారు.
సీనియర్ హీరో సురేష్ మాట్లాడుతూ...నా క్యారెక్టర్ పండింది అంటే కారణం శివ. ఆయన బ్రిలియంట్ గా వర్క్ చేస్తారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా డైరెక్టర్ శివకే చెందుతుంది. నాకు మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన శివ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గురించి చెప్పాలంటే...నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రొడక్షన్ హౌస్లో బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇది. తారక్ వండర్ ఫుల్ కోస్టార్. సహజంగా హీరోలు కథ తన పైనే ఉండాలి అనుకుంటారు కానీ తారక్ తన సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండాలి అనుకుంటారు అది తారక్ గొప్పతనం. రాముడుకి ఉడత సాయం చేసినట్టుగా నేను ఓ క్యారెక్టర్ చేసాను. ఒకప్పుడు కారణజన్ముడు ఎన్టీఆర్.. ఇప్పుడు ఇంకో కారణజన్ముడు తారక్ ఇది నిజం అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ...నా మొదటి సినిమా ఎన్టీఆర్ గారితో చేసాను. అలాగే మేజర్ చంద్రకాంత్ లో నటించాను. బాలయ్యబాబుతో సీమసింహం, కళ్యాణ్ రామ్ తో పటాస్ చేసాను. ఇప్పుడు మన ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేయడం ఆనందంగా ఉంది. జనత గ్యారేజ్ లో ఎన్టీఆర్, మోహన్ లాల్ తో పాటు నేను పోలీసాఫీసర్ గా చేస్తున్నాను అనగానే హైప్ వచ్చింది. నిజం చెబుతున్నాను... పోలీస్ స్టోరీ నాకు ఎంత పేరు తీసుకు వచ్చిందో ఈ సినిమాలోని డిగ్నిఫైడ్ పోలీస్ క్యారెక్టర్ కి కూడా అంతే పేరు వచ్చింది. ఈ చిత్రంలో తారక్ అద్భుతంగా నటించాడు. తారక్ తో నటిస్తుంటే ఎన్టీఆర్ గారితో నటించిన ఫీలింగ్ కలిగింది. షూటింగ్ టైమ్ లోనే ఈ సినిమా 100 కోట్ల సినిమా అని చెప్పాను. అది నిజమయినందుకు ఆనందంగా ఉంది అన్నారు
సుకుమార్ మాట్లాడుతూ...సినిమా చూసి షాక్ అయ్యాను. కామెడీ లేదు. కొరటాల శివ లాస్ట్ టైమ్ కామెడీ లేకుండా తీసాడు ఓకే. ఈసారి కూడా కామెడీ లేదు ఏం ధైర్యం ఎన్టీఆర్ ఉన్నాడనా..? అనిపించింది. ఎన్టీఆర్ కి ఫోన్ చేసి సినిమా బాగుంది కానీ ఏ రేంజ్ కి వెళుతుంది అనే విషయం పై లోపల డౌట్ ఉంది అని చెప్పాను. సినిమా రిలీజైన తర్వాత నా డౌట్స్ అన్ని ఎగిరిపోయాయి. సినిమా చరిత్రలో శివ ముందు శివ తర్వాత ఎలా చెబుతారో...కమర్షియల్ సినిమా గురించి కొరటాల శివ ముందు కొరటాల శివ తర్వాత అని చెబుతారు అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి 8 రోజుల్లోనే పెట్టుబడి వచ్చేసింది. ఇలాంటిది ఒక్క ఎన్టీఆర్ సినిమాలకే సాధ్యం. ఆది, సింహాద్రి చిత్రాల వలే ఎన్టీఆర్ స్టామినా ఏమిటో చూపించేలా విజయాన్ని అందించిన అందరికీ ధ్యాంక్స్ అన్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...నేను తమ్ముడు గూబ గుయ్యమనే లాగ ఎప్పుడు కొడతాం..? అని ఆలోచించే వాళ్లం. ఒక రోజు తారక్ జనతా గ్యారేజ్ సక్సెస్ నాన్నగారి బర్త్ డే గిఫ్ట్ అని చెప్పాడు. ఈ గిఫ్ట్ నాన్నగారికి చెందుతుంది. కొరటాల శివ గారు నందమూరి ఫ్యాన్స్ కోరిక, అలాగే తమ్ముడు కోరిక నెరవేర్చారు. నేను ఆడియో ఫంక్షన్ లో పాల్గొనలేకపోయినందుకు బాధపడ్డాను. అయినా నేను ఆడియో ఫంక్షన్ కి రాకపోయినా తమ్ముడిని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు అన్నారు.
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.... ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు, డి.ఎస్.పి గారు సాయికుమార్ గారు, సురేష్ గారు, నిత్యామీనన్..ఇలా అందరూ సహకరించడం వలనే ఈ సక్సెస్ సాధ్యమైంది. అభిమానులే ఎన్టీఆర్ బలం. మాకు ఎన్టీఆరే బలం. ఈ సక్సెస్ ఎన్టీఆర్ కి కొత్త కాదు. నేను ఇండస్ట్రీలోకి రాక ముందే ఎన్టీఆర్ రికార్డ్స్ క్రియేట్ చేసాడు. టెంపర్ సినిమా దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టైల్ మార్చారు. ఇక నుంచి ఎన్టీఆర్ ఇలాంటివి ఎన్నో చేస్తారు అన్నారు.
నిర్మాత నవీన్ మాట్లాడుతూ...ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఎన్టీఆర్ గార్కి, శివ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఈ టీమ్ తో కలిసి మరిన్ని మంచి సినిమాలు అందిస్తాం అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ...ఈ చిత్రాన్ని 1వ తారీఖున రిలీజ్ చేసినప్పుడు మిశ్రమ స్పందన లభించింది. ఆ స్పందన చూసి కన్ ఫ్యూజ్ అయ్యాను. అయితే.. శివ పై నాకు నమ్మకం. అలాగే మా నమ్మకాన్ని వమ్ము చేయరని ప్రేక్షకాభిమానుల పై నమ్మకం. మా నమ్మకం నిజం అయినందుకు...అభిమానులు అందరిలో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని మా పేరెంట్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాను. నాకు జనతా గ్యారేజ్ అనే గిఫ్ట్ ఇచ్చినందు శివకి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నేను, అన్నయ్య ఎందుకు సక్సెస్ రావడం లేదు అని బాధపడేవాళ్లం. నేను తల ఎత్తుకునేలా చేసాడు శివ. ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే సక్సెస్ ఇది. నా కళల్లో నీళ్లు అపుకుంటున్నాను. ఒక గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబంలో పుట్టడం అదృష్టం. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటాను. నేను బతికున్నంత కాలం అభిమానులకు ఆనందం కలిగించేందుకు ఏమైనా చేస్తాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మళ్లీ జన్మ ఉంటే మీ ప్రేమ పొందేలా ఉండాలి అనుకుంటాను అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout