Janasena Woman Activists:పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు : జోగి రమేష్‌కు చీర , సారె .. వీర మహిళల వినూత్న నిరసన
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీలో నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన కొన్నిరోజులుగా జనసేన శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అసభ్యకర వ్యాఖ్యలు, చేతగాని మాటలు మాట్లాడుతున్న జోగి రమేష్‌కి చీర , సారె పెట్టి నిరసన తెలియచేస్తామంటూ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో ఛలో పెడన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యులు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి కృష్ణా జిల్లావ్యాప్తంగా వీర మహిళలు, నాయకులతో కలసి వివిధ మార్గాల్లో పెడన బయలుదేరారు. వీరిని గూడూరు శివార్లలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. సౌజన్య, విజయలక్ష్మీని తొలుత పామర్రు పోలీస్ స్టేషన్‌కి తర్వాత జాతీయ రహదారిపై తిప్పుకుంటూ ఉయ్యూరు పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఉయ్యురు పోలీస్ స్టేషన్‌కు భారీగా జనసేన కార్యకర్తలు :
అరెస్టు విషయం తెలుసుకున్న పామర్రు నియోజకవర్గ జనసేన నేత తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. బుధవారం సాయంత్రం 4.30 గంటల తర్వాత వీరిని విడుదల చేశారు. వీర మహిళలకు మద్దతుగా పెడన నియోజకవర్గానికి చెందిన పలువురు జన సైనికులు ఎస్వీ బాబు ఆధ్వర్యంలో పెడన చేరుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు 14 మందిని అరెస్టు చేసి మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సమాచారం అందుకున్న మచిలీపట్నం జనసేన ఇంఛార్జ్ బండి రామకృష్ణ , పార్టీ నాయకులు కొరియర్ శ్రీనివాస్ తదితరులు స్టేషన్‌కి చేరుకుని అక్రమ అరెస్టులను ఖండించారు. కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే సాయంత్రం 5.30 గంటల వరకు పోలీసులు వారిని విడిచిపెట్టేందుకు అంగీకరించలేదు. జనసేన శ్రేణుల నిరసనల నేపథ్యంలో పెడనలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
జోగి రమేష్ ఏమన్నారంటే :
సోమవారం గుంటూరు జిల్లా వెంకటపాలెంలో అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌తో కలిసి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆవేశంతో ఊగిపోయారు. కుక్కలకు కూడా సీజన్ వుంటుందని.. చిత్తకార్తి సమయంలో కుక్కలు కూడా రోడ్డు మీదకు వచ్చి మొరుగుతాయని.. కానీ ఇలాంటి చిత్తకార్తి కుక్కలు ఎన్నికల సీజన్‌లో రోడ్డు మీదకు వస్తున్నాయని రమేశ్ మండిపడ్డారు. చంద్రబాబు మొసలి నక్క, పవన్ కల్యాణ్ పిచ్చికుక్క, పవన్ కళ్యాణ్ పెళ్లాలనే కాదు పార్టీలను మారుస్తాడని మంత్రి వ్యాఖ్యానించారు. మార్చటం , తార్చటం పవన్ కల్యాణ్‌కు వెన్నతో పెట్టిన విద్య అని.. ఏ పార్టీని, ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ జోగి రమేశ్ వ్యాఖ్యానించారు. జగన్‌ను ఎవరూ టచ్ చేయలేరని.. మా వెంట్రుక కూడా పీకలేరని, ఊరపంది తిరిగినట్లు ఒకడు రోడ్లపై తిరుగుతున్నాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments