జనసేన పార్టీ అంటేనే ధైర్యం… పోరాటం చేయడం!
- IndiaGlitz, [Sunday,April 28 2019]
జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జయకేతనం ఎగురవేసేలా జన సైనికులు కృషి చేయాలని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం తెలిపారు.
రాష్ట్రంలో మార్పు మొదలైందని, సార్వత్రిక ఎన్నికల్లో యువత, మహిళలు, వృద్ధులు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. ఆదివారం విజయనగరంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో విజయనగరం పార్లమెంటరీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. జనసేన ముఖ్యనేతలు హాజరై పోలింగ్ సందర్భంగా అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ .. నా రాజకీయ జీవితంలో చాలా మంది నాయకులతో పనిచేశాను. చాలామంది నాయకులతో పరిచయాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నిబద్ధత కలిగిన నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదు. ప్రజాసేవ కోసం జీవితాన్ని అంకితం చేయాలని విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా వదులుకున్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్‌కి భయపడి అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితుల్లో జనసేన మాత్రమే ధైర్యంగా అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. కొన్ని వర్గాలు, కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని, వెనకబడిన వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బీఎస్పీ పార్టీ తో కలిసి దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాం.
జనసేన పార్టీ కొన్ని జిల్లాల్లో బలహీనంగా ఉందని కొందరు అంటున్నారు. అది అబద్ధం. పవన్ కళ్యాణ్ గారు మన మనసులో ఉంటే బలహీనం అనే ప్రసక్తే లేదు. ఆయనే మన బలం. ఏ పార్టీలోనైనా విభేదాలు సర్వసాధారణం. జనసైనికులు మనస్పర్ధలను పక్కనపెట్టి కలసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలి అని గంగాధరం కోరారు.