ఆ ఐదు లోక్‌సభ స్థానాలు జనసేనవే..!
- IndiaGlitz, [Thursday,May 02 2019]
విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్‌సభ స్థానాలు జనసేన పార్టీకి ఖాయమైపోయాని, మిగిలిన లోక్ సభ స్థానాల్లో మన పార్టీ గట్టిపోటీ ఇస్తుందని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు మొదలైందని.. సార్వత్రిక ఎన్నికల్లో యువత, మహిళలు, వృద్ధులు జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో అనూహ్య ఫలితాలు వెలువడనున్నాయన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. ఎన్నికల్లో కష్టపడిన జనసేన కార్యకర్తలకు జనసేన ముఖ్య నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందాలని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు. అందుకోసం నిద్రాహారాలు మాని ప్రజాసేవ చేస్తున్నారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కనిపిస్తుంది. రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్ వాది పార్టీకి 25 ఏళ్లు పడితే.. జనసేన మాత్రం ఐదేళ్లలో రాజ్యాధికారం చేపట్టబోతుంది. ఎన్నికల తర్వాత కూడా జనసేన నాయకులు ప్రజల మధ్య తిరుగుతుంటే అధికార, ప్రతిపక్షాలకు గుండెలు గుభేల్ అంటున్నాయి. ఫలితాల్లో ఎవరి కొంప మునుగుతుందో అని తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఒక్క మాట అనడానికి భయపడుతున్న తరుణంలో హైదరాబాద్ నడిబొడ్డున సభ పెట్టి కేసీఆర్‌ను నిలదీసిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల 20 మందికి పైగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. జనసేన పార్టీ మాత్రమే విద్యార్ధుల తరఫున ఆందోళన చేసి, వారి తల్లిదండ్రులకు అండగా నిలబడింది. పవన్ విద్యార్ధులకు న్యాయం చేయాలని ప్రకటన విడుదల చేయగానే.. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రీవాల్యూషన్ చేస్తున్నట్లు ప్రకటించింది అని ఆయన చెప్పుకొచ్చారు.