ఆడపడుచుల రక్షణ బాధ్యత జనసేనదే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆడపడుచులకు రక్షణ కల్పించే బాధ్యత జనసేనదేనని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం మహిళా దినోత్సవం కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. "మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం నాడు మేనిఫెస్టో ప్రకటించాలని భావించాను. రైతుల కుటుంబాన్ని నడిపే మహిళలు నన్ను ఆలోచింప చేయడం వల్ల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే ప్రకటించాను. రెండు లక్షల కోట్ల బడ్జెట్‌కి నోటికి వచ్చిన చందంగా ఐదు లక్షల కోట్ల హామీలు ఇచ్చి మోసం చేయడం ఇష్టం లేకనే ప్రతి అంశంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాను. అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న హామీలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. నేను మాత్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని తీరుతా. రైతుల కష్టాలు చూస్తుంటే ఆవేదన కలిగిస్తుంది. అన్నం పెట్టే రైతులు దేవతలతో సమానం. రైతు క్షేమంగా ఉంటేనే రామరాజ్యం వస్తుంది.
మహిళలకు ఒకరోజు సరిపోదు...
"నా దృష్టిలో మహిళల్ని గౌరవించడానికి ఒక్కరోజు సరిపోదు. ఉమెన్స్ డే, మదర్స్ డే అంటూ ఒక్క రోజుకే అది పరిమితం కారాదు. మహిళా దినోత్సవాలను లక్ష్యం దిశగా చేయాలి. తూతూ మంత్రంగా నిర్వహించడం కాదు. ఏడాది పొడవునా మహిళా సాధికారిత, వారి మానప్రాణ రక్షణ దిశగా ముందుకి వెళ్తామని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నేను రాజకీయాల్లోకి రావడం వెనుక వున్న బలమైన కారణాల్లో ఒకటి ఆడపడుచులపై జరుగుతున్న ఆకృత్యాలు. పార్టీ నిర్మాణంలో మండల స్థాయి వరకు 33 శాతం ఆడపడుచులకి అవకాశం ఇస్తాం. పని చేయగలిగే వారు.. నిబద్దతతో నిలబడగలిగే ఆడపడుచుల కోసం చూస్తున్నాను. అలాంటి వారు ముందుకి వచ్చిన నాడు పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలకి చోటు కల్పిస్తాం. చట్టసభల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రత్యర్ధుల వ్యూహాల ఆధారంగా దాని అమలు సాధ్యపడుతుంది. పార్టీ పదవుల్లో మాత్రం ఖచ్చితంగా మూడో వంతు రిజర్వేషన్ అమలు చేస్తాను. పార్టీ పదవులు ఎవ్వరికీ అలంకారం కారాదు. బాధ్యత అవ్వాలి. బాధ్యతగా పనిచేసే అలాంటి ఆడపడుచుల కోసం ఎదురుచూస్తున్నాను. పదవులు ఇచ్చే విషయంలో ఏమైనా తప్పొప్పులు ఉంటే నా దృష్టికి తీసుకురండి. చేసిన పనికి తగ్గ పదవులు దక్కకపోతే నాకు తెలపండి" అని ఆడపడుచులకు పవన్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments