ఆడపడుచుల మాన, ప్రాణాలు కాపాడే బాధ్యత జనసేనదే
- IndiaGlitz, [Tuesday,February 26 2019]
చట్ట సభల్లో ఆడపడుచులకి మూడో వంతు స్థానం ఉండాలనీ, అయితే అది చేయడానికి నేను చట్టసభల్లో లేను కాబట్టి పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల్లో మహిళలకి మూడో వంతు చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నానని జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు. కమిటీలు వేసినప్పుడు మొదటి స్థానం ఆడపడుచులకి ఇవ్వడానికి కారణం, అంతా మహిళలకి రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మాట్లాడుతారు.. కానీ నేను మాత్రం చేసి చూపానన్నారు.
మంగళవారం కర్నూలు యు.బి.ఆర్ కన్వెన్షన్ హాల్లో వీర మహిళా విభాగం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ..మహిళలు రాజకీయాల్లోకి వస్తే నోరేసుకుని పడిపోవాలి, పెద్ద పెద్దగా అరవాలన్న విధానం మారాలి. జనసేన ఆడపడుచులు మాత్రం విజ్ఞతతో వ్యవహరించాలి. బాధ్యతతో ఉండాలి. అవసరమైనప్పుడు ఝాన్సీ లక్ష్మిబాయిలా యుద్ధం చేయాలి, మథర్ థెరిస్సాలా సేవా చేయాలి. ఓ వీర మహిళ, ఓ తల్లి కలగలిసిన మహిళల్లా ఉండాలి. మీ మాన ప్రాణాలు కాపాడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.
చిన్నారులపై ఆకృత్యాలు జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు క్రిమినల్స్‌ని వెనకేసుకు వస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది. అలాంటి వారికి న్యాయం జరిగే స్థాయి చట్టాలు రావాలంటే ఆడపడుచులు రాజకీయాల్లోకి రావాలి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవాలి. పసి బిడ్డల మీద ఆకృత్యాలకి పాల్పడే వారికి శిరచ్ఛేదం చేయాలి. నా చిన్నప్పుడు నా అక్కకి జరిగిన చిన్న సంఘటన నా మనసు మీద బలమైన ముద్ర వేసింది. పెద్దయ్యాక ఇలాంటి ఆకృత్యాల మీద బలమైన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా. అర్థరాత్రి ఆడది బయట తిరగడం ఏమో గానీ, పగటి పూట బయటికి వెళ్లిన స్త్రీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తిరిగి వచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది అని అబలలకు పవన్ భరోసా ఇచ్చారు.