Saidharam Tej:సాయిధరమ్ తేజ్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన
- IndiaGlitz, [Monday,May 06 2024]
పిఠాపురం నియోకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ కాన్వాయ్‌పై దాడిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శ్రీ సాయి ధరమ్‌తేజ్ కాన్వాయ్‌పై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడే ప్రయత్నాన్ని నాగబాబు తీవ్రంగా ఖండించారు. వైసీపీ మూకలు విసిరిన గాజు ముక్కలు తగిలి జనసైనికుడు శ్రీధర్ తలకు తీవ్ర గాయాలు కావడం చాలా బాధాకరం. పిఠాపురం ప్రభుత్వాసుప్రతిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. జనసేన పార్టీ చేస్తున్న ర్యాలీలోకి వైసీపీ రౌడీ మూకలు చొచ్చుకుని రావడం, వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ జనసైనికులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా స్థానిక పోలీసు అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం. వైసీపీ మార్క్ రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను అధికారులను కోరుతున్నాం. అని పేర్కొన్నారు.
కాగా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా సాయిధరమ్ తేజ్ ప్రచారం నిర్వహించేందుకు తాటిపర్తికి వెళ్లారు. దీంతో ఆయన కోసం భారీగా జనసైనికులు తరలి వచ్చారు.. స్థానిక గజ్జాలమ్మ కూడలికి చేరుకుని పవన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న వైసీపీ వర్గీయులు జగన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వైసీపీ వర్గీయులు బాణాసంచా కాల్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య నినాదాలు, వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ తిరిగి వెళుతుండగా కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో నల్లల శ్రీధర్ అనే జనసైనికుడికి తలకు తీవ్ర గాయమైంది. బాధితుడ్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఇరువర్గాలను అక్కడి నుంచి తరిమికొట్టారు ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తేజ్ పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇలా చేశారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్‌ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. ఓటమి భయంతోనే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని.. లేకపోతే కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని, గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ను ముట్టడిస్తామని వర్మ హెచ్చరించారు. కడప, కర్నూలు నుంచి కొంతమంది ముఠా పిఠాపురం వచ్చినట్లు తమకు పక్కాగా సమాచారం ఉందన్నారు. ఇలాంటి రౌడీ మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ సాయి ధరమ్ తేజ్ గారిపై దాడి ప్రయత్నాన్ని ఖండిస్తున్నాం
— JanaSena Party (@JanaSenaParty) May 6, 2024
వైసీపీ మార్కు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించేది లేదు
జన సైనికుడు శ్రీధర్ తలకు గాయం కావడం బాధాకరం
పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం @IamSaiDharamTej… pic.twitter.com/HOJEAr3awx