జగన్ పాలనపై జనసేన రిపోర్ట్ రెడీ.. 14న రిలీజ్!
- IndiaGlitz, [Thursday,September 12 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లను సంపాదించుకున్న వైసీపీ.. ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వందరోజులు పూర్తి చేసుకున్న విషయం విదితమే. వైఎస్ జగన్ పాలనపై వందరోజుల పాలనపై ఇప్పటికే టీడీపీ, బీజేపీతో పాటు చిన్న పార్టీలు స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. అయితే ఇంతవరకూ జనసేన మాత్రం స్పందించనేలేదు. వాస్తవానికి జగన్ సర్కార్‌కు కొంత సమయం ఇస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అందుకే.. వంద రోజుల పాలనపై అన్ని అధ్యయనం చేసేందుకు పార్టీ నేతలు, నిపుణులతో కొద్దిరోజుల క్రితం కమిటీ వేయడం జరిగింది. తాజాగా పూర్తి వివరాలతో పవన్‌కు కమిటీ నివేదిక అందించడం జరిగింది.
ఇదిలా ఉంటే.. ఈ నివేదికను ఈ నెల 14న విడుదల చేసేందుకు జనసేన రంగం సిద్ధం చేసుకుంది. ఈ నివేదిక రిలీజ్‌కు మంగళగిరిలోని జనసేన కార్యాలయం వేదిక కానుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను విడుదల చేయబోతున్నారు. కాగా.. జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. అసెంబ్లీ, మీడియా మీట్ వేదికగా వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో జనసేన రిపోర్టులో ఏముంటుందనే దానిపై ఏపీ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నివేదికలో ఏమేం ఉన్నాయో..? ప్రభుత్వంపై ఎన్నెన్ని విమర్శలు చేశారో..? అనేది తెలియాలంటే 14వరకు వేచి చూడాలి మరి.