అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి... కానీ మరొకరి నష్టంపై కాదు : జనసేన
- IndiaGlitz, [Friday,December 20 2019]
అమరావతి: రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. మందడంలో ఆందోళనకు దిగిన రాజధాని రైతులకు మద్దతు తెలిపారు జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, నాగబాబు. ప్రజా సమస్యలపై, అవసరాలపై ఏమాత్రం అవగాహన లేని ప్రభుత్వం ఇదని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రజలను శిక్షించొద్దని వైసీపీ సర్కార్ ను కోరిన ఆయన... రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందనే రైతులు భూములు ఇచ్చారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ.. మరొకరి నష్టంపై కాదు అన్నారు. బాధ్యత కలిగిన పార్టీగా జనసేన ప్రజలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని... పోలవరం, అమరావతి నిలిచిపోతే రాష్ట్రానికి ఎవరు ఇస్తారని, పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రైతులు రాష్ట్రం కోసం త్యాగం చేశారని... వారికి జనసేన భరోసాగా నిలుస్తుందన్నారు. అధికారం ఉందని సీఎం మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే తీరాలన్నారు నాగబాబు. రాజధానిని యధాతధంగా కొనసాగించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో కుటుంబాలతో సహా రైతులు రోడ్డెక్కారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు నాగబాబు.