Janasena Presiden:వేలమంది ఆడబిడ్డలు మాయమవుతున్నారు .. వైసీపీ గ్యాంగ్స్ పనే : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Monday,June 19 2023]
తనతో పాటు సినిమా రంగంలో ఉన్న అందరి హీరోలంటే తనకు అమితమైన అభిమానమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కాకినాడలో జరిగిన వారాహి యాత్రలో ఆయన ప్రసంగిస్తే.. తన తోటి హీరోల సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, చిరంజీవి, రవితేజ ఇలా అందరు హీరోలతో తనకు మంచి సంబంధాలున్నాయని పవన్ చెప్పారు. ఏ హీరో అభిమానులైనా సరే తనకు అండగా నిలబడాలని ఆయన కోరారు. సినిమా వినోదం... రాజకీయం జీవితం అనేది తెలుసుకోవాలన్నారు. మనందరి జీవితాలను శాసించే రాజకీయ నాయకులను ఉన్నత ఆలోచనతో ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతరం తీసుకోవాలని, కులాలకు అతీతంగా ఆలోచించాలనీ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
బాబాయ్‌ని చంపి కూతురి మీద నిందవేస్తున్నారు :
ఫీజు రియంబర్సుమెంటుకు మంగళం పాడిన వ్యక్తి, ఉపాధి దూరం చేసిన వ్యక్తి, ఏడాదికి 2.5 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసిన వ్యక్తిని నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. ఓ బృహత్తరమైన ఆలోచనతో షణ్ముఖ వ్యూహం అమలు చేసి, యువత పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెస్తామని మాటిస్తున్న పవన్ కళ్యాణ్‌ను నమ్ముతారో ఆలోచించాలన్నారు. సొంత బాబాయిని క్రూరంగా హత్య చేసి, మొదట గుండెపోటు అని అన్నారని.. తర్వాత హత్య అని బయటకు వచ్చాక చాలా మందిపై నెపం నెట్టేయడానికి ప్రయత్నించారని పవన్ దుయ్యబట్టారు. వివేకా హత్యను రాజకీయంగానూ వాడుకున్నారని.. ఇప్పుడు వైరాలజీ చదువుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీతపై నింద వేసేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. యూఎస్‌లో ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్ సునీత తన తండ్రి హత్య విషయంలో న్యాయం చేయాలని ఎక్కని కోర్టు లేదు.. తొక్కని గడప లేదన్నారు. చివరకు ఆమెనే నిందితురాలిగా చిత్రీకరించేందుకు సైతం వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారని పవన్ మండిపడ్డారు.
ముగ్గురు కలిసి ఇసుక దోపిడీ :
గతంలో రూ.6 నుంచి రూ.8 వేలు పెడితే ట్రక్కు ఇసుక వచ్చేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక నిర్వహణ బాధ్యతలను మూడు కంపెనీలకు అప్పగించారని.. దానిలో ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది , మరొకటి ముఖ్యమంత్రి కుటుంబసభ్యులదని, ఇంకోకటి వారికి దగ్గరవారిదేనని చెప్పారు. వీరంతా క్షేత్రస్థాయిలో వేర్వేరు వ్యక్తులను బినామీలుగా మార్చుకొని వేలాది కోట్లను దోచేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇసుక దోపిడీ, బియ్యం అక్రమ రవాణాలను అరికడితే జనసేన అనుకున్న అద్భుతమైన పథకాలకు నిధుల లోటు ఉండదన్నారు.
అత్యున్నత పదవి చేపట్టడానికి సిద్ధం :
అవినీతికి అడ్డుపడితే.. ఆంధ్రా అభివృద్ధికి బోలెడు దారులున్నాయని, నిజాయతీ గల వ్యక్తులను అసెంబ్లీకి పంపాలని పవన్ పిలుపునిచ్చారు. సభలకు, ర్యాలీలకు వచ్చే సమయంలో కాదు.. ఎన్నికల సమయంలో తనకు అండగా నిలబడాలని పవన్ కోరారు. దమ్ము, ధైర్యం, శౌర్యం, పోరాటం నిజ జీవితంలో చూపాలన్నారు. అత్యున్నత పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తన పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ తప్పు జరిగినా తాను స్వయంగా బాధ్యత తీసుకుంటానని, ప్రజల తరఫున నిలబడతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఆడపిల్లలు ఏమవుతున్నారు :
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో దిగజారిపోయాయని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల వైజాగ్‌లో చెప్పారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆయన మాటల వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయని చెప్పారు. దేశంలోనే ఆడపిల్లల అక్రమ రవాణా, గంజాయి ఎగుమతులు, మట్కా క్లబ్బులు ఇలా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే అమిత్ షా మాట్లాడారని పవన్ తెలిపారు. డీజీపీ రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగానే ఉన్నాయని చెబుతున్నారని ఆయన చురకలంటించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 33 వేల మంది ఆడపిల్లలు ఎలా మిస్ అయ్యారు..? ఎవరు అపహరిస్తున్నారని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రం మహిళల అక్రమ రవాణాకు కేంద్రం అయ్యిందని.. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో 2వ స్థానంలో ఉందని చెప్పారు. యువతులను వైసీపీ క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కడికి తరలిస్తున్నాయో తెలియడం లేదన్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే 2021లో ఒక యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేస్తే ప్రసన్న రెడ్డి అనే నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారని పవన్ ఎద్దేవా చేశారు.