Pawan Kalyan Vaarahi: ఆ రోజు నుండి రోడ్డెక్కనున్న పవన్ వారాహి...
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి ద్వారా జనాల్లోకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం మీడియాకు వివరించారు. జూన్ 14న తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభిస్తారని నాదెండ్ల చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు , పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు మీదుగా.. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలలో పవన్ యాత్ర జరుగుతుందని ఆయన చెప్పారు.
పవన్‌కు అండగా వుండాలన్న నాదెండ్ల :
ఈ యాత్రలో జనసేన వీర మహిళలు, జనసైనికులకు పవన్ భరోసా కల్పిస్తారని నాదెండ్ల తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు వుండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఖచ్చితంగా ఫీల్డ్‌కి వెళ్లేలా పవన్ కల్యాణ్ పర్యటన సాగుతుందని నాదెండ్ల వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకునేందుకు వారాహి యాత్ర ఉపయోగపడుతుందని.. ఈ యాత్రలో నేతలు, కార్యకర్తలు పాల్గొని పవన్‌కు అండగా నిలవాలని మనోహర్ కోరారు.
సీరియస్‌గా రాజకీయాలపై పవన్ ఫోకస్:
కాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్రతో పాటు జనవాణి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. గతేడాది ఏడాది దసరా నాడు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ భావించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం వుండటంతో ఆయన జాగ్రత్త పడుతున్నారు. షూటింగ్ విరామ సమయాల్లో రాష్ట్రంలోని ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. చేతిలో వున్న సినిమాలను వేగంగా కంప్లీట్ చేసి పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
వారాహిపై ర్యాలీగా బందర్ వరకు వెళ్లిన పవన్ :
ఈ క్రమంలో ఈసారి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ బస్సు యాత్ర నిర్వహించాలని పవన్ కల్యాణ్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి తన అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా బస్సును తయారు చేయించారు. దీనికి ‘వారాహి’ అనే పేరు పెట్టారు. ఇప్పటికే కొండగట్టు ఆంజనేయస్వామి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు.. విజయవాడ నుంచి బందర్ వరకు దానిపై ర్యాలీగా వెళ్లి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు పవన్ కల్యాణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments