సింగిల్‌గా రమ్మనడానికి మీరెవరు.. మీ అతి తగ్గించుకోండి : వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం నంద్యాల జిల్లాలో జరిగిన జనసేన కౌలు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ... సింహం సింగిల్‌గా వస్తుందంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో, ఎలా రాజకీయాలు చేయాలో మీరు నేర్పుతారా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు ఏం చేయాలో తాము నిర్దేశిస్తాం అప్పుడు చేస్తారా.. ముందు మీ అతి తగ్గించుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని.. కేవలం వ్యూహాలు మాత్రమే ఉంటాయని పవన్ కల్యాణ్ అన్నారు. 1977 ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా భావసారూప్యత భిన్నంగా ఉన్న అన్ని పార్టీలు కలిసి, విజయం సాధించాయని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి దారుణాలు, చేస్తున్న మోసాలకు విసిగిపోయిన ప్రజలు ఓటును చీల్చకూడదు అన్నదే తన ఉద్దేశమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తటస్థ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత ప్రభుత్వ తీరు మీద బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏదైనా విమర్శలు చేస్తే కులాలకు చెందిన నాయకులతో తిట్టిస్తున్నారని.. వ్యక్తిగత విమర్శలకు ధీటుగా బదులు ఇవ్వగలనని, అయితే దానివల్ల ప్రయోజనం సున్నా అని పవన్ అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని... ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో మా ప్రయాణం కొనసాగుతోందని.. పౌరుషాలు, పంతాలకు వెళ్ళననని జనసేనాని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజల కోసం సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి అన్నదే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ ప్రజల అండతో సిద్ధంగా ఉందని.. ఒకవేళ ఎన్నికలు ముందస్తుగా వచ్చిన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని పవన్ స్పష్టం చేశారు. 151 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినా ప్రజల కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తుల విషయం, ఇతర విషయాలు ఏ మాత్రం రహస్యంగా చేసే పద్ధతి ఉండదని.. అంతా పారదర్శకంగానే ప్రజాక్షేత్రంలోనే ముందుకు వెళ్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. మద్యం ద్వారా వస్తున్న గణనీయమైన డబ్బును వచ్చే ఎన్నికల్లో ఓటుకు నోటు పంచుకోవడానికి వైసీపీ నేతలు దాచుకుంటున్నారని పవన్ ఆరోపించారు. ప్రజలు బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని దీనిపై బిజెపి జాతీయ నాయకులకు తెలియజేస్తానని, వారి సమ్మతి తీసుకొనే ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఇస్తే కొన్ని కోట్లమంది కన్నీళ్లు తుడుస్తానని, తనను ఆశీర్వదించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఏటా లక్ష మంది యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి.. వారు పదిమందికి ఉపాధి కల్పించేలా చూసే అద్భుతమైన ఆలోచనలు జనసేన పార్టీ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments