Pawan:వాళ్ల తాతకు డీటీ నాయక్ బేడీలు.. ఈ డెకాయిట్‌కి భీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ ఇస్తా : ద్వారంపూడికి పవన్ వార్నింగ్
- IndiaGlitz, [Monday,June 19 2023]
వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది. దీనిలో భాగంగా ఆదివారం కాకినాడ సర్పవరం కూడలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడలో మరోసారి గెలవనివ్వనని ఆయన స్పష్టం చేశారు. ద్వారంపూడి తాత కాలం నుంచి ఇలాంటి అరాచకాలే వున్నాయని పవన్ ఆరోపించారు. చంద్రశేఖర్ రెడ్డి తాత అక్రమ బియ్యం, దొంగనోట్లు, దౌర్జన్యాల్లాంటివి చేస్తుంటే అప్పట్లో ఈ జిల్లాకు ఎస్పీగా వున్న డీటీ నాయక్ అతన్ని నడిరోడ్డు మీద చేతులకు బేడీలు వేసి పోలీసు జీపు వెనుక నడిపించారని పవన్ గుర్తుచేశారు. ద్వారంపూడిని కూడా ఈ భీమ్లానాయక్ కూడా అదే తీరున రోడ్డుపై నడిపించే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు.
మదమెక్కి కొట్టుకుంటున్నాడు :
అధికార మదమెక్కి, తాగిన మైకంలో ద్వారంపూడి నా మీద నోటికొచ్చినట్లు మాట్లాడాడని.. దిగజారి మరీ పచ్చి బూతులు తిట్టాడని పవన్ ఆరోపించారు. తనను తిట్టినందుకు కోపం వచ్చి ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు జనసైనికులు, వీర మహిళలు వెళితే ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడులు చేశారని చెప్పాడు. తనను తిట్టినందుకు కాదని.. వీర మహిళలను అసభ్యంగా ద్వారంపూడి అనుచరులు దాడి చేసినపుడు తనకు కోపం వచ్చిందని పవన్ తెలిపారు. కచ్చితంగా ఈ ఎమ్మెల్యేను బలంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు జనసేనాని చెప్పాడు. పెన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడను వైసీపీ ప్రభుత్వం క్రిమినల్స్‌కు అడ్డాగా మార్చేస్తోందన్నారు. చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయని.. మరోసారి ఇలాంటి డి గ్యాంగులు గెలిస్తే, పూర్తిగా మన ఇళ్లను కూడా దోచుకునే పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
బియ్యం అక్రమ రవాణాతో రూ.15 వేల కోట్లు :
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే బియ్యం అక్రమ రవాణా ద్వారా అక్షరాలా రూ.15 వేలు కోట్లు సంపాదించాడని పవన్ కల్యాణ్ ఆరోపించారు. గోదావరి జిల్లాలకు ఆయన అనధికార ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడని పవన్ దుయ్యబట్టారు. కాకినాడలో కనిపించిన ప్రతి ఆస్తి, అగుపించిన ప్రతి భూమి ప్రజల నుంచి లాగేసుకుంటున్నాడని ఆరోపించారు. కాకినాడ కేంద్రంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం విస్తరించిందని పవన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అండ చూసుకొని చెలరేగిపోతున్న ఈ ఎమ్మెల్యే వ్యవస్థలను చెప్పుచేతల్లోకి తీసుకొని అరాచకం సృష్టిస్తున్నాడని.. కచ్చితంగా ప్రతి తప్పుకు ప్రజలకు సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన జోస్యం చెప్పారు.