Pawan Kalyan:ప్రభాస్ సినిమాలు చేసి సంపాదిస్తే.. జగన్ అక్రమాలతో వెనకేశారు : నర్సాపురంలో పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తన సభకు పక్కనే ప్రభాస్ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీని చూసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు పవన్. ప్రభాస్ సినిమాలు చేయడం వల్ల 500 నుంచి 1000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభాస్ కాదు.. ఎలాన్ మస్క్ కాదు, మరి జగన్‌కు అంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, పైరవీలు చేసి సంపాదించిన సొమ్ముని ఆయన దుయ్యబట్టారు. టీనేజ్‌లో వున్నప్పుడు జగన్ ఓ ఎస్ఐని కొట్టి.. సెల్‌లో వేశాడని, అలాంటి వ్యక్తికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
బటన్ నొక్కుతూ కాలక్షేపం :
మాట్లాడితే బటన్ నొక్కే ఈ సీఎం .. రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైన పనులకు సంబంధించిన బటన్ నొక్కకుండా వదిలేశాడని జనసేనానిని దుయ్యబట్టారు. ఈయన పంచే డబ్బు ఆయన సొంత డబ్బు కాదని.. అది మనం పన్నుల రూపంలో చెల్లిస్తున్నదేనని పవన్ అన్నారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో 30 మందికే దానిని అందిస్తూ, మిగిలిన 70 శాతం ప్రజలకు జగన్ హ్యాండిస్తున్నారని జనసేనాని ఎద్దేవా చేశారు. మన డబ్బు మనకే పంచుతూ సవాలక్ష నీతులు పంచుతున్నారని , అర్హులకు కాకుండా తమ వారికే ఇస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయం చేసే పరిస్థితులు లేవని, ఆరుగాలం శ్రమించి రైతు పండిస్తున్న పంటలో ప్రతి బస్తాకు రూ.100లు ద్వారంపూడి కుటుంబానికి వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. రైతులు కష్టపడుతుంటే.. వైసీపీ నాయకులు కేవలం ఇంట్లో వుండి సంపాదిస్తున్నారని పవన్ దుయ్యబట్టారు. గోదావరి జిల్లాల్లో మామిడి చెట్లను నరికే సంస్కృతిని తీసుకొస్తున్నారని.. పులివెందుల రౌడీ రాజకీయలు అక్కడికే పరిమితం చేసుకోవాలని, ఇక్కడికి తీసుకొస్తే తన్ని తగలేస్తామన్నారు.
ఓడినప్పుడు బాధపడ్డా :
2019లో ఓడిపోయినప్పుడు బాధపడ్డానని.. కానీ అంబేద్కర్ లాంటి వ్యక్తికే ఓటమి ఎదురైందని తిరిగి యుద్ధ క్షేత్రంలో దిగానిన పవన్ తెలిపారు. కులాన్ని , డబ్బుని చూసి కాకుండా మనిషిని చూసి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. నర్సాపురంలో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించకపోవడం వల్ల వరదల సమయంలో చెత్తంతా గోదావరిలోకి వెళ్తోందన్నారు. భోపాల్‌లో చెత్త ద్వారా ఎరువులు, మిథైన్ గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారని.. మన పలికిమాలిన సలహాదారులను, అధికారులను అలాంటి వాటి పరిశీలనకు పంపితే ప్రయోజనకరంగా వుంటుందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం.. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా ఇవ్వరని పవన్ చురకలంటించారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ కంపెనీలు పెరుగుతుంటే వైజాగ్ నుంచి వెళ్లిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి జిల్లాల్లో వైసీపీని గెలవనివ్వను :
పుట్టుకతోనే ఎవరూ వైవీ సుబ్బారెడ్డిలా తెల్లగడ్డంతో పుట్టరని, రాజకీయాల్లో కిందపడి, నలిగి ఓ స్థాయికి వస్తారని పవన్ పేర్కొన్నారు. 2008లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తాను అనుభవం తెచ్చుకున్నానని ఆయన తెలిపారు. రాజ్యాధికారానికి దూరంగా వున్న వర్గాలను కలుపుకుని వెళ్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. బీసీలకు, కాపులకు మధ్య గొడవపెట్టాలని చూశారని, తుని రైలు ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాలను ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌గా తీర్దిదిద్దుతామన్నారు. నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఒక్కో యువకుడికి రూ.10 లక్షలు ఆర్ధిక సాయం అందించి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని పవన్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో వైసీపీని ఒక్క సీటు కూడా గెలవకుండా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలు ఈ ప్రాంతానికి ససేమిరా రానివ్వమని పవన్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే జగన్ పోవాలి, జనసేన రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com