Pawan Kalyan:వైసీపీకి 175 కాదు .. 15 సీట్లొస్తే గొప్ప, వచ్చేది టీడీపీ - జనసేన ప్రభుత్వమే : పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Monday,October 02 2023]

వారాహి విజయయాత్ర నాలుగో దశలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వచ్చే ఎన్నికల్లో జగన్‌కు 175 కాదు.. 15 సీట్లు వస్తే గొప్ప అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కురుక్షేత్రమేనని జగన్ అంటున్నారని, అయితే కౌరవులు వాళ్లేనని, ఓడిపోయేది కూడా వాళ్లేనని జోస్యం చెప్పారు. 100 మందికిపైగా వున్న వైసీపీ వాళ్లే కౌరవులని .. తాము అధికారంలోకి రావడం ఖాయమని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నాయని.. అభ్యర్ధులు వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకునేందుకు సిద్ధమైనా ఒక్క డీఎస్పీ కూడా వేయలేదని జనసేనాని దుయ్యబట్టారు. 2014లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ఇచ్చానని.. అయితే కొన్ని హామీల విషయంలో, ప్రత్యేక హోదా అంశంలో వారితో విభేదించి కూటమి నుంచి బయటకొచ్చానని పవన్ వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల కారణంగా వారికి మద్ధతుగా నిలుస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

నా దగ్గర డబ్బులు వుండొద్దని సినిమా టికెట్ 5 రూపాయలు చేశారు :

ఈసారి ఓటు చీలనివ్వకూడదని.. వైసీపీని దించడమే తమ లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. గత ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుచుంటే ఇవాళ డీఎస్సీ అభ్యర్ధులు ప్లకార్డులు పట్టుకుని నిలబడాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. వేల కోట్లు దోచేసిన జగన్ ఇంకా దోచుకుంటున్నారని, మీ వద్ద డబ్బులు వుండకూడదని మీకు ఉద్యోగాలు ఇవ్వడని వ్యాఖ్యానించారు. తన దగ్గర డబ్బులు వుండకూడదని నా సినిమా టికెట్ల ధర రూ.5 చేశాడని, అందరూ తన వద్ద దేహీ అనాలన్నదే జగన్ ఆలోచన అని పవన్ ఎద్దేవా చేశారు.

వైసీపీ మహమ్మారికి జనసేన, టీడీపీ వ్యాక్సినే మందు :

జగన్ లాంటి అధికార మదంతో విర్రవీగే వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని.. తన వద్ద ఓట్లు కొనేందుకు డబ్బులు లేవని ఆయన తెలిపారు. 500, 2 వేలకి ఓటును అమ్ముకోవద్దని ఓటర్లకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నైతిక బలంతోనే బలమైన జగన్‌తో గొడవ పెట్టుకున్నానని.. మనకు పార్టీల కంటే రాష్ట్రం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తోన్న వైసీపీ మహమ్మారికి.. జనసేన, టీడీపీ వ్యాక్సినే మందు అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. కులాల వారీగా మనల్ని వేరు చేస్తున్నారని.. ఏపీ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్‌కి ఉరేశారని దుయ్యబట్టారు. సైకిల్ , గ్లాస్ కలిసి ఫ్యాన్‌ను తరిమేస్తాయని.. జగన్ పరిస్ధితి ఓడిపోయే ముందు హిట్లర్ పరిస్ధితిలా వుందని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.