Pawan Kalyan:వివేకా కేసు.. అన్ని వేళ్లూ సీఎం ఇంటివైపే, క్లాస్ వార్‌పై మాట్లాడతారా : జగన్‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బుధవారం కత్తిపూడిలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. పాపం పసివాడులా మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సొంత చిన్నాయనను చంపిన వారిని శతవిధాలా రక్షించేందుకు తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు. బాబాయి కూతురు న్యాయ పోరాటం చేస్తుంటే దాన్ని కనీసం పట్టించుకోని ఈయన క్లాస్ వార్ గురించి మాట్లాడుతుంటే వింతగా అనిపిస్తుందని చురకలంటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ బలవంతుడు, రాజకీయ బలహీనుడు అనే రెండు వర్గాల మధ్యనే పోరు నడుస్తోందని పవన్ స్పష్టం చేశారు.
నిస్సహాయంగా వివేకా కూతురు :
తన తండ్రిని హత్య చేసిన వారి కోసం న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ సునీతకు కోర్టులో కనీసం వాదించేందుకు అడ్వకేట్లు దొరకడం లేదన్నారు. ఈ క్రమంలో సొంతంగా కేసు వాదించుకుంటూ వ్యవస్థలోని రాజకీయ బలవంతానికి సజీవ సాక్షిగా నిస్సహాయంగా నిలబడిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో అన్నీ చేతులు సీఎం ఇంటి వైపే చూపిస్తున్నాయని.. అయినా న్యాయం అందని పరిస్థితి నెలకొందన్నారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న వారిని సైతం ముఖ్యమంత్రి ఎదుట చేతులు కట్టుకునేలా చేసి, సీఎం క్లాస్ వార్ గురించి మట్లాడటానికి సరిపోరని పవన్ స్పష్టం చేశారు.
కులాల మధ్య వైసీపీ చిచ్చు :
ఓ నాయకుడు గట్టిగా అనుకుంటే కులాల మధ్య సఖ్యత తీసుకురాగలడు.. అలాగే విద్వేషాలు రెచ్చగొట్టగలడని జనసేనాని అన్నారు. ఎస్సీ, బీసీ నాయకులతో నన్ను తిట్టించి.. మళ్లీ మనం మనం తిట్టుకునేలా చేయడమే వైసీపీ నైజమని పవన్ ఆరోపించారు. మనం తిట్టుకుంటే వారు ఆనందపడతారని, ప్రజల్లో చీలిక తెచ్చి ఆనందపడతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో వైసీపీకి బీసీల గర్జనలు గుర్తుకొస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాత్రం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి, ఎన్నికల్లో 16,800 మంది బీసీలు పదవులకు వైసీపీ ఎసరు పెట్టిందని పవన్ కల్యాణ్ చిట్టా విప్పారు.
600 నామినేటెడ్ పోస్టుల్లో 500 సొంత కులానికే :
తెలంగాణలో 18 బీసీ కులాలను తొలగిస్తే వైసీపీ సర్కారు పక్క రాష్ట్రం పెద్దలతో కనీసం మాట్లాడింది లేదన్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నా ఎస్సీ సోదరులు అంటారని.. వారి సంక్షేమానికి కీలకమైన 18 సంక్షేమ పథకాలను తీసేశారని పవన్ ఎద్దేవా చేశారు. దళిత డ్రైవర్ ను చంపేసి ఇంటికి పార్శిల్ చేసిన వ్యక్తులకు ఏ పార్టీ వంత పాడుతుందో యువత అర్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని చెప్పినా... వైసీపీకి ఓటేస్తే కాపులకు ప్రాధాన్యం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 600 నామినేటేడ్ పోస్టుల్లో ఏకంగా 500 వరకు తన సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టాడని సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అలాంటి వ్యక్తి అందరినీ అందలం ఎక్కిస్తానంటే నమ్మడం సాధ్యమా.. ప్రజలు ఆలోచించాలని జనసేనాని పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి కల్పిస్తాం:
జనసేన ప్రభుత్వం రాగానే అత్యంత ప్రాధాన్యత షణ్ముఖ వ్యూహంలోని యువతకు స్వయం ఉపాధి చూపించడంపైనే పెడతామని పవన్ హామీ ఇచ్చారు. ఎంతో నైపుణ్యం ఉన్న యువత రాష్ట్రంలో ఉందని.. వారికి సరైన పెట్టుబడి లేక నిస్సహాయంగా ఉండిపోతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఏటా 500 మందిని ఎంపిక చేసి, వారికి వెంటనే రూ.10 లక్షల మేర సాయం చేసేలా ప్రణాళిక ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఏదైనా యూనిట్ నెలకొల్పి వారు పదిమందికి ఉపాధి చూపితే రాష్ట్రంలో నిరుద్యోగం ఉండదు.. అద్భుతమైన సంపద సృష్టి సాధ్యమేనని పవన్ ఆకాంక్షించారు. దీనికి ఏటా రూ.10 వేల కోట్లు అవుతుందన్న ఆయన.. వైసీపీ పాలనలో కేవలం ఇసుక దోపిడీపైనే ఏటా రూ.10 వేల కోట్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. దాన్ని అడ్డుకుని యువతకు అవసరమైన పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments