Pawan Kalyan : ఎన్నికలకు ఎలా వెళ్లాలి.. ఒక్క రోజులో తేల్చలేం : చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్
- IndiaGlitz, [Wednesday,October 19 2022]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని బతికించడంతో పాటు రాజకీయ పార్టీలుగా ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలనే అంశం మీద ఆలోచన చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశమైన అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ముందుగా రాజకీయ పార్టీలు ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే గొంతు నొక్కేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనీ, వీటిపై కలసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచి వైసీపీపై పోరాటం చేసే వ్యూహాలు మార్చబోతున్నట్టు ఆయన తెలిపారు.
ఢిల్లీలో లడ్లు పంచి... ఇక్కడ పేగులు బయటకు లాగుతారు:
విశాఖలో జనసైనికుల మీద అన్యాయంగా కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టడం.. బైండోవర్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీల పెద్దలు ఫోన్ ద్వారా మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జగ్గారెడ్డి , తీన్మార్ మల్లన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ .. ఈ రోజు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చిన చంద్రబాబుక మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని పవన్ తెలిపారు. మా సొంత మిత్ర పక్షం బీజేపీ నాయకుల మీదా అన్యాయంగా కేసులు పెట్టారని.. వారి నాయకుణ్ణి విజయనగరంలో పేగులు బయటకు వచ్చేలా పొడిచారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇదే ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో అదే పార్టీ నేతలకు లడ్డూలు ఇస్తారని... రాష్ట్రంలో అదే బీజేపీ నాయకుల మీద కేసులు పెడతారంట జనసేనానని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలసికట్టుగా ముక్తకంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉందన్నారు.
నేతల పరిస్థితే ఇలా వుంటే.. సామాన్యులకు దిక్కువరు :
మా మీదే ఇలాంటి అడ్డగోలు కేసులు పెడుతుంటే రాష్ట్రంలో సగటు మనిషి పరిస్థితి ఏంటో అంతా ఆలోచించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల గురించి ఆలోచించాల్సిన సమయం కాదని... ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయమన్నారు జనసేనాని. ప్రజాస్వామ్యం బతికితే అప్పుడు ఎన్నికల గురించి ఆలోచించవచ్చని... ఇది ఒక్క రోజులో తేలే వ్యవహారం కాదని పవన్ వ్యాఖ్యానించారు. ఎవరేం చేసినా ఆగేది లేదని... కచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి వారికి అండగా నిలిచేందుకు ప్రజల్లోకి వెళ్తూనే ఉంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.