Pawan Kalyan:ప్రభాస్ , మహేష్ నా కంటే పెద్ద హీరోలు.. నాకేం ఇగో లేదు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Thursday,June 22 2023]

ప్రభాస్, మహేష్ తనకంటే పెద్ద హీరోలని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రామ్ చరణ్, తారక్ ప్రపంచ స్థాయికి వెళ్లిపోయారని ప్రశంసించారు. వాళ్లు తనకంటే పెద్ద హీరోలని చెప్పడానికి తనకు ఎలాంటి ఈగోలు లేవని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి , బాలకృష్ణ ఇలా అందరు హీరోలు తనకు ఇష్టమేనని ఆయన తెలిపారు. వాళ్ల సినిమాలు తాను కూడా చూస్తానని.. కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని పవన్ వెల్లడించారు. సినిమా అనేది వినోదమని.. రాజకీయం వేరని, సినిమాల పరంగా మీరు నచ్చిన హీరోను ఇష్టపడినా రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం ఒక్కసారి జనసేన వైపు చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జనసేన ప్రభుత్వంలో పోలీసులకు వారాంతపు సెలవులు :

పోలీసులు ఎంత ఒత్తిడి తీసుకుంటున్నారో తాను అర్ధం చేసుకున్నానని.. నిజాయతీగా పనిచేద్దామన్నా వైసీపీ ప్రభుత్వంలో పనిచేయలేకపోతున్నారని పవన్ అన్నారు. నిద్రాహారాలు, సెలవులు లేవని.. టి.ఏ, డి.ఏ.లు చివరికి జీతాలు కూడా టైమ్ కు రావడం లేద్నారు. జనసేన ప్రభుత్వం రాగానే పోలీసులకు వారాంతపు సెలవులు కచ్చితంగా ఇస్తామని, ఒత్తిడి తగ్గిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కొత్తగా రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు.

పదవులన్నీ ఒక్క సామాజికవర్గానికేనా :

శెట్టిబలిజ, తూర్పుకాపు .. ఇలా చాలా బీసీ కులాలను తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి తొలగించారని, రాష్ట్రంలోని ఒక్క నాయకుడు కూడా దీనిపై మాట్లాడలేదని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కులాన్ని వారు గౌరవించుకుంటూనే ఆంధ్రులం అనే భావన మనలో రాకపోతే నష్టపోతామని ఆయన హితవు పలికారు. కులాల గురించి ప్రస్తావిస్తుంటే కొంతమంది వైసీపీ పెద్దలు బాధపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కీలకమైన పదవులన్నీ ఒక్క రెడ్డి సామాజికవర్గానికి ఇవ్వడం కరెక్టా అని జనసేనాని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు లేరా? శెట్టిబలిజలు లేరా? యాదవులు లేరా? అగ్నికుల క్షత్రియులు లేరా? అని ఆయన నిలదీశారు. అధికారంలో ఉన్నాం కదా అని ఒక్క కులానికే ప్రాధాన్యత ఇస్తే మిగతా కులాల పరిస్థితి ఏంటని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. చేతులెత్తి జోడించి అడుగుతున్నానని.. మిగతా కులాలకూ న్యాయం చేయాలని, అప్పుడు తాను కులాల గురించి మాట్లాడటం మానేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.