Pawan Kalyan:ఏపీ ప్రజల డేటా హైదరాబాద్‌లో.. ‘‘ఎఫ్ఓఏ’’ ఎవరిది, ఏం చేస్తున్నారు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Thursday,July 13 2023]
వాలంటీర్ వ్యవస్థపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయయాత్రలో భాగంగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 6 కోట్ల మంది ప్రజల సమాచారం హైదరాబాద్ నానక్‌రామ్ గూడ ప్రాంతంలోని ఎఫ్ఓఏ అనే ఏజెన్సీ వద్ద వున్నారు. అక్కడ పనిచేస్తున్న 700 మంది సిబ్బంది ప్రజల డేటాతో ఏం చేస్తున్నారు.. వారికి వేతనాలు ఎవరు చెల్లిస్తున్నారు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రెడ్‌క్రాస్ వాలంటీర్లకు రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు అధిపతులని.. మరి ఏపీలోని వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ నిలదీశారు. వాలంటీర్లు ఏదో చేసేస్తారు.. పథకాలు ఆగిపోతాయని అనుకోవద్దని, ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.
వాలంటీర్లలో పుచ్చులు , కుళ్లిన వ్యక్తులు :
వ్యక్తిగత సమాచారం తీసుకునే లీగల్ అథారిటీ వాలంటీర్లకు ఎవరిచ్చారు..? వాలంటీర్ల వ్యవస్థలోకి కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించాయని పవన్ ఆరోపించారు. వాలంటీర్ల ముసుగులో గ్రామాల్లో బాలికలను లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని.. పలు నేరాల్లో వాలంటీర్లే దోషులుగా తేలారని పవన్ గుర్తుచేశారు. వాలంటీర్ వ్యవస్థలోని పుచ్చులను, కుళ్లిపోయిన శక్తులను ఏరిపారేసేవారు ఎవరని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లలో అంతా చెడ్డవారు వుంటారని తాను చెప్పడం లేదని.. జగనన్న మాదిరిగా కొందరు వాలంటీర్లు జైలుకు వెళ్లి నాయకులుగా మారాలని అనుకుంటున్నారనంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.
వాలంటీర్ల జీతం ఉపాధి కూలి కంటే తక్కువ:
డిగ్రీ, పీజీలు చదివిన యువతను జగన్ రూ.5 వేలకు పరిమితం చేశారని.. అంటే రోజుకు రూ.164.38 పైసల వేతనమన్నారు. ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీ రూ.274 కంటే వాలంటీర్ వేతనం తక్కువన్నారు. బూంబూం బీర్‌ను రూ.220కి, ఆంధ్రా గోల్డ్ విస్కీని రూ.130కి జగన్ అమ్ముతున్నాడని.. అంటే వాలంటీర్ల రోజువారీ వేతనలు ఆంధ్రా గోల్డ్ కంటే ఎక్కువ.. బూంబూం బీర్ కంటే తక్కువ అంటూ పవన్ సెటైర్లు వేశారు. జనసేన మొదలెట్టిన జనవాణి కార్యక్రమానికి స్పూర్తి ఓ మహిళా వాలంటీర్ అని ఆయన గుర్తుచేశారు.
చావు ఇంటికి వెళ్లిన సీఎం వెకిలి నవ్వులు :
తండ్రి లేని పిల్లాడని.. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి జగన్ వారిని బలంగా కాటేశాడని పవన్ దుయ్యబట్టారు. మద్యం అమ్మకాల ద్వారా రూ. 1.30 లక్షలు కోట్లు మింగేశాడని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి.. చావు ఇంటికి వెళ్లినా వికారంగా నవ్వుతూ వుంటారని.. చివరికి సూపర్‌స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు మహేశ్ పుట్టెడు దు:ఖంలో వుంటే పరామర్శించడానికి వెళ్లి అక్కడా జగన్ నవ్వుతూనే వున్నాడని పవన్ మండిపడ్డారు. జగన్ జీవితం మీద ఇటీవల సినిమాలు తీస్తున్నారని.. ఆయన మీద అయోగ్యుడు అనే పుస్తకం రాస్తే దానికి ముందుమాట నేను రాస్తానంటూ జనసేనాని చురకలంటించారు.
నా భార్య కంటతడి పెట్టింది :
జగన్ సతీమణి భారతి గారిని మేం మేడం అని పిలుస్తామని.. ఆమె గురించి ఎప్పుడూ తాను ప్రస్తావించలేదని .. ఈయన మాత్రం నా భార్యను పెళ్లాం అని సంబోధిస్తాడని పవన్ మండిపడ్డారు. చిన్న పిల్లలు పాల్గొన్న కార్యక్రమంలో పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి దిగిజారి ప్రవర్తించాడని జగన్‌పై ఫైర్ అయ్యారు. అక్కడే ఆయన సంస్కారం ఎలాంటిదో అర్ధం అవుతోందని.. అలా మాట్లాడినప్పుడుల్లా తన భార్య కంటతడి పెట్టిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు క్షమాపణలు చెప్పి తాను బయటకొచ్చానని ఆయన గుర్తుచేశారు.
సాక్షి పత్రిక కోసం వాలంటీర్ల జీతం కట్:
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి సంబంధించి రూ.669 కోట్ల నిధులు ఏమయ్యాయని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వరని.. పారిశ్రామికవేత్తలను లంచాలు ఇవ్వాలంటూ పీడిస్తారని, పన్నులు తప్పు పనులు చేయరంటూ జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హక్కుల కోసం ప్రశ్నించిన హనుమాయమ్మ అనే అంగన్‌వాడీ కార్యకర్తను వైసీపీ మనుషులు చంపేశారని పవన్ ఆరోపించారు. వాలంటీర్లకు గౌరవ వేతనం కింద రూ. 5,200 ఇస్తున్నారని.. అయితే సాక్షి పత్రిక సర్కూలేషన్ పెంచడానికి అందులో రూ.200 కట్ చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. చివరికి ఏ పేపర్ చదవాలో కూడా జగనే డిసైడ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
సైనికుడి భూమిని కబ్జా చేసేస్తున్నారు :
తాడేపల్లి గూడెం నియోజకవర్గంలోని మిలటరీ మాధవరం గ్రామం నుంచి 2,700 మంది సైనికులు దేశ రక్షణలో సేవలందించారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అలాంటి ఊరులో కనీస మౌలిక సదుపాయాలు లేవని, ఈ వూరును జగన్ పట్టించుకోవడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సైనికులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూడా వైసీపీ నేతలు వదలడం లేదని ఆరోపించారు. సొంత చిన్నాన్ననే గొడ్డలితో చంపేసిన వ్యక్తులతో తాను పోరాడుతున్నానని.. సొంత తల్లిని, చెల్లినే బయటకు పంపించిన వ్యక్తికి ప్రజలపై ప్రేమ వుంటుందా అని పవన్ ప్రశ్నించారు. లలిత, కళ అనుకునే రకం ఈ ముఖ్యమంత్రి అని.. వైఎస్ భారతీ గారు .. మీ ఆయన్ను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలని ఆయన సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనదే గెలుపని పవన్ జోస్యం చెప్పారు.