Pawan Kalyan:ఎన్డీయే సమావేశానికి పవన్ కళ్యాణ్ .. పొత్తులపై సంచలన వ్యాఖ్యలు, సీఎం పదవి పైనా క్లారిటీ
- IndiaGlitz, [Tuesday,July 18 2023]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీల నేతలు అభ్యర్ధుల ఎంపిక నుంచి అన్ని విషయాలపై ఫోకస్ పెట్టారు. ఎక్కువ సమయం ప్రజల్లో వుండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఒంటరి పోరుకు సిద్ధమవుతూ వుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లుగానే కనిపిస్తోంది. కానీ స్పష్టమైన ప్రకటన మాత్రం రావడం లేదు. టీడీపీ, జనసేన పొత్తులకు సూత్రప్రాయంగా అంగీకారంగా తెలిపినట్లుగా.. బీజేపీ మాత్రం కలిసి రావడం లేదు. చంద్రబాబు, పవన్‌లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నా గత అనుభవాల నేపథ్యంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. మొన్నామధ్య అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవ్వడంతో పొత్తు ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ పరిస్ధితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది.
ఎన్డీయే సమావేశానికి పవన్‌కు ఆహ్వానం :
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే పక్షాల సమావేశం కూడా టీడీపీకి షాకిచ్చింది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించిన చంద్రబాబు నాయుడుకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. కానీ పవన్ కల్యాణ్‌కు మాత్రం ఇన్విటేషన్ వచ్చింది. ఆయన కూడా వస్తున్నట్లు సమాచారం ఇచ్చి ఢిల్లీలో వాలిపోయారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. పొత్తులు, వచ్చే సార్వత్రిక ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ఎన్నికల ఫలితాలను బట్టి సీఎం ఎవరనేది నిర్ణయిస్తామని పవన్ వ్యాఖ్యానించారు. అయితే తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని జనసేన కేడర్ కోరిక అని జనసేనాని పేర్కొన్నారు.
2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే వున్నాయన్న పవన్ :
రాష్ట్రానికి, తమకు అండగా నిలిచేవారే అధికారంలో వుండాలని ప్రజలు కోరుకుంటున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అంతా కలిసి పోరాడాలని.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వుండాలనేదే తన అభిప్రాయమని పవన్ పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య కొన్ని అవగాహనా లోపాలు వున్నాయని.. 2014లో మూడు పార్టీలు కలిసే వున్నాయని ఆయన గుర్తుచేశారు. 2019లో విడిపోయినా.. 2020లో బీజేపీ-జనసేన మళ్లీ ఒకే వేదిక మీదకు వచ్చాయన్నారు. క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల మరోవైపు.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపైనా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదని.. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో వుండటంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని జనసేనాని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, రాజకీయాలను ఎన్డీయే సమావేశంలో చర్చించే అవకాశం వుందని.. అలాగే పొత్తులపైనా స్పష్టత రావొచ్చని పవన్ పేర్కొన్నారు.