GoodMorningCMSir : మీ వూళ్లో రోడ్ల పరిస్ధితేంటీ .. ఫోటోలు, వీడియోలు తీయండి : ప్రజలకు పవన్ విజ్ఞప్తి

  • IndiaGlitz, [Thursday,July 14 2022]

రోడ్ల మరమ్మత్తులపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం ఈ మేరకు ఈయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా కనీసం 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్, మరమత్తు పనులు చేపట్టాలని, ఇందుకోసం దాదాపు రూ.1500 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని పవన్ గుర్తుచేశారు. ఇది కాకుండా పీరియాడికల్ మెయింటినెన్స్, రిపేర్లు చేయాలని, ఇందుకోసం మరో రూ.500 కోట్లు అదనంగా కేటాయించాలని జనసేనాని వెల్లడించారు. నాన్ ప్లాన్ బడ్జెట్లో చూపిస్తారని... అయితే దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టడం మానేసిందని పవన్ ఎద్దేవా చేశారు. ఈ మూడేళ్లలో మెయింటినెన్స్, మరమత్తు పనులు చేయకపోవడంతో రహదారులు చాలా వరకు దెబ్బ తిన్నాయని ఆయన దుయ్యబట్టారు. 30 వేల కిమీ మేర రోడ్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక గుంతలమయంగా మారిందని పవన్ కల్యాణ్ చురకలు వేశారు.

బిల్లులు చెల్లిస్తేనే కదా.. కాంట్రాక్టర్లు పనులు చేసేది:

మూడేళ్లుగా పట్టించుకోకపోవడంతో చాలా వరకు కొత్తగా రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. మరమ్మతులకే నిధులు లేక రోడ్లను గాలికొదిలేసిన ప్రభుత్వం.. కొత్త రోడ్లు వేయడం అంటే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులరీత్యా అసాధ్యమేనని పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కనీస మరమ్మతులు, ఒక లేయర్ వేసి కాస్త ప్రయాణానికి తగ్గ విధంగా చేయాలంటే దాదాపు రూ.7 వేల కోట్లు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 8 వేల కిమీ రోడ్లు మెయింటినెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2100 కోట్లు అప్పు తెచ్చారని.. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని పవన్ మండిపడ్డారు. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని.. రోడ్లు నిర్వహణ కోసం అని పెట్రో సెస్ వసూలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇది రూ.750 కోట్ల మేర ఏటా ప్రభుత్వానికి చేరుతుందని... ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియడం లేదని పవన్ అనుమానం వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలా.. రోడ్ల పరిస్ధితి ఏంటీ:

అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు రోడ్లు అవసరం లేదు అనే ఆలోచన విధానంతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో తెలియజేయడం కోసం #GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మీ ఊళ్ళో, మీ చుట్టు పక్కల రోడ్లు ఎంత దారుణంగా దెబ్బ తిన్నాయో.. ఆ రోడ్డు మీద వెళ్లేందుకు ఎంత ప్రయాస పడాల్సి వస్తోంది అనేది చెప్పే ఫోటోలు, వీడియోలు తీయాలని జనసేన శ్రేణులకు, ప్రజలకు పవన్ సూచించారు. వాటిని #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆయన కోరారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో తాను కూడా పాల్గొంటానని.. మీరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.