jubilee hills gang rape : ‘రేప్’ చేయాలన్న ఆలోచనే రాకుండా శిక్షలుండాలి : పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా మృగాళ్లను కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అలాంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకురావాలని పవన్ కల్యాణ్ కోరారు. చట్టసభ సభ్యులు, మేధావులు, సంఘ సంస్కర్తలపై ఈ బాధ్యత ఎంతగానో ఉందని ఈ అమానుష సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయి.
ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయారో:
ఇటీవల శంషాబాద్ పరిసరాల్లో జరిగిన 'దిశ' హత్యాచార ఘటన మరువక ముందే, ఈ వారంలో హైదరాబాద్లో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మైనర్ బాలురు వారు ప్రయాణిస్తున్న కారులోనే అత్యాచారానికి పాల్పడడం మాటలకు అందని దుర్మార్గమని ఆయన విచారం వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై పరులెవ్వరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారని.. అలాంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే బాధితురాలితోపాటు ఆమె తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయివుంటారోనని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దారుణ పరిస్థితి పగవారికి సైతం రాకూడదని కోరుకునే భారతీయ సమాజం మనదని ఆయన గుర్తుచేశారు. అటువంటి సమాజం నుంచి వచ్చిన మన బిడ్డలు రాక్షసులుగా మారి ఇటువంటి నీచాలకు పాల్పడడం ఉపేక్షించడానికి వీలు లేని ఘోరంగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
నిందితుల నుంచే పరిహారం రాబట్టాలి :
ఈ కేసులో పోలీసుల పరిశోధన చురుగ్గా సాగుతున్నప్పటికీ దోషులలో ఏ ఒక్కరు తప్పించుకోకుండా ఈ పరిశోధనను ముందుకు తీసుకెళ్లాలని జనసేనాని డిమాండ్ చేశారు. ముద్దాయిలు చిన్నవారైనా, పెద్దవారైనా, పలుకుబడి ఉన్నవారైనా పట్టి చట్టం ముందు నిలబెట్టాలని ఆయన కోరారు. దోషులకు శిక్ష పడినంత మాత్రాన అత్యాచారానికి బలైన ఆ బాలికకుగాని, ఆమె కుటుంబానికిగాని న్యాయం జరిగిందని భావించకూడదన్నారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని, దోషుల కుటుంబాల నుంచి భారీగా నష్టపరిహారం రాబట్టి బాధితురాలికి అందజేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆమె నిలదొక్కుకుని సామాన్య జీవితం కొనసాగించడానికి తెలంగాణ మంత్రి, నవతరం నాయకులు కేటీఆర్ చొరవ చూపాలని జనసేన అధినేత విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments