Janasena:అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర.. షెడ్యూల్ ఖరారు, ఎక్కడి నుంచి అంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పవన్ యాత్రలు పూర్తి చేశారు. తాజాగా నాలుగో విడతకు ఆయన శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్రను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నుంచి మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా యాత్ర సాగేల ప్రణాళిక సిద్ధమైంది. పూర్తి షెడ్యూల్‌ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నాదెండ్ల నిర్ణయించారు.
ఈసారి యాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొనే ఛాన్స్ :
టీడీపీతో పొత్తు ఖరారయ్యాక తొలిసారిగా పవన్ చేస్తున్న యాత్ర కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు చంద్రబాబు జైల్లో వుండటంతో కూటమిని నడిపించాల్సిన బాధ్యత పవన్‌దేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ యాత్రలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
టీడీపీ-జనసేన పొత్తుపై నాగబాబు కీలక వ్యాఖ్యలు :
కాగా.. ఆదివారం టీడీపీ, జనసేన పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావిస్తారని తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన లక్ష్యమని.. టీడీపీది కూడా అదే ధోరణి కావడంతోనే ఎన్నికలకు కలిసి వెళ్లాలని పవన్ నిర్ణయించారని నాగబాబు పేర్కొన్నారు. ఈ కూటమిలో ముఖ్యమంత్రి ఎవరు అనేది కాలమే నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనే దానికంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు పనిచేస్తాయని నాగబాబు వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం బాధ కలిగించిందని, రాజకీయ కక్ష సాధింపులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నాగబాబు హితవు పలికారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ పొత్తుపై నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తమ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని జనసైనికులు, వీర మహిళలు స్వాగతిస్తున్నారని నాగబాబు చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని, అలాగే బీజేపీతోనూ పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com