కోనసీమ అల్లర్లు వైసీపీ పనే.. గొడవ జరగాలని 30 రోజుల గడువు : పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టి.. కోనసీమకు మాత్రం మరో విధానం అనుసరించారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. అమలాపురం అల్లర్లపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో ఉద్దేశ్యం ఏమిటని ఆయన నిలదీశారు. జిల్లాలకు జాతీయ స్థాయి నాయకుల పేర్లను పెట్టడాన్ని జనసేన సమర్థిస్తుందని.. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి వ్యక్తిని పొట్టి శ్రీరాములను జిల్లాకు పరిమితం చేశారని పవన్ దుయ్యబట్టారు.
పేర్లు పెట్టేటప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాల్సి ఉందని జనసేనాని సూచించారు. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారని.. కృష్ణా నది ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ పేరు పెట్టారని పవన్ చురకలు వేశారు. జిల్లా పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారని.. వైసీపీ దురుద్దేశం ఇట్టే అర్థమవుతోందని, గొడవలు జరగాలని ఆ పార్టీ అనుకుందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారు.. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా అని ఆయన నిలదీశారు. సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారని, ఇది వ్యక్తులను టార్గెట్ చేయడమేనని జనసేన భావిస్తోందన్నారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
దాడి జరుగుతుందంటే ఇంటికి రక్షణగా ఉండాలని.. ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా అంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తారా.. కులసమీకరణపై రాజకీయాలు చేస్తారా అంటూ ఆయన ఫైరయ్యారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని.. మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపారని, మృతదేహాన్ని ఇంటికి తెచ్చి పడేశారని పవన్ గుర్తుచేశారు. ఎస్సీ వ్యక్తి కావడంతో వ్యతిరేకత వచ్చిందని.. ప్రజల దృష్టి మరల్చేందుకే కోనసీమలో గొడవలు రేపారని జనసేనాని ఆరోపించారు.
కోనసీమకే పేరు పెట్టడం వెనుక ప్రభుత్వ ఆలోచనేంటి అని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవచ్చు కదా అంటూ పవన్ విమర్శించారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టేలా చూడాలని కోరారని.. మొదటి ఎస్సీ ముఖ్యమంత్రి పేరు పెట్టడం మంచిదని సూచించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లాకు పేరు పెడతామని చెప్పానని ఆయన వెల్లడించారు. అంబేడ్కర్ స్ఫూర్తిని అమలు చేయటం మాని వేరే పనులు చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్‌పై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సజావుగా అమలు చేయాలని.. గత రెండేళ్లలో రూ.10 వేల కోట్లు దారిమళ్లించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని.. ఎస్సీలకు ఇవ్వాల్సిన వాహనాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఎస్సీలకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వటం ఆపేశారని.. అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనకు నిధులు ఇవ్వటం లేదని పవన్ విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు ఆజ్యం పోసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోడి కత్తి ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని.. వైఎస్ వివేకా హత్య విషయంలో వాస్తవాలేంటని పవన్ నిలదీశారు. కోడికత్తి కేసు సమయంలో ఏపీ పోలీసులను నమ్మేది లేదని చెప్పారని జగన్‌కు చురకలు వేశారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంటే ఎందుకు విచారించట్లేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మీపై హత్యాయత్నంతో సానుభూతి సంపాదించి ఎన్నికల్లో గెలిచారని పవన్ ఆరోపించారు. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఏపీలో అత్యధికంగా 557 అట్రాసిటీ కేసులు ఉన్నాయని చెప్పారని ఆయన గుర్తుచేశారు.
కులాల మధ్య ఘర్షణ రావణకాష్టం లాంటిదని.. కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని.. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. ఇలాంటి వారి ఉచ్చులో పదవద్దని, అలాగే వైసీపీ నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలని పవన్ హితవు పలికారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య గొడవలకు కారణం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments