అభిమాని అత్యుత్సాహం.. కారుపై పడిపోయిన పవన్ కల్యాణ్, తప్పిన ముప్పు
- IndiaGlitz, [Monday,February 21 2022]
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నర్సాపురం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు గాను రాజమహేంద్రవరం నుంచి నరసాపురం ర్యాలీగా వస్తున్న పవన్ కల్యాణ్ మార్గమధ్యంలో కారుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి ఓ అభిమాని దూసుకొచ్చాడు. పవన్‌ను అందుకునే ప్రయత్నంలో అతను గట్టిగా లాగడంతో.. నిల్చుని అభివాదం చేస్తున్న జనసేనాని కారుపైనే పడిపోయారు. ఈ ఊహించని పరిణామంతో పవన్ సహా, అభిమానులు షాక్ తిన్నారు. ఆపై మళ్లీ పైకి లేచిన ఆయన యథావిధిగా ముందుకు సాగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనంతరం నరసాపురంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్దండులని విమర్శించారు. రాజమహేంద్రవరం నుంచి నరసాపురం వస్తుంటే... దారి పొడవునా గోతులేనన్నారు. పడవ ప్రయాణంలా రోడ్లపై ఊగుతూ వస్తుంటే.. మాయాబజార్‌లో లాహిరి లాహిరి పాట గుర్తొచ్చిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా గెలిచిన జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చేసి, ప్రతి చోటా భయాందోళనకు గురి చేస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ నేతల బెదిరింపులకు జనసైనికులు భయపడరని.. అక్రమ కేసులతో ఇలాగే హింసిస్తే తెగించి రోడ్డుపై నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.
సమస్య పరిష్కారం పేరుతో మళ్లీ అనేక ఇబ్బందులు పెడతారని... అన్ని కులాలకు సమాన ఆర్థిక పరిస్థితుల్లేవన్నారు. వంగి వంగి దండాలు పెట్టేందుకు రాజకీయాల్లోకి రాలేదని పవన్ స్పష్టం చేశారు. మద్యం అమ్ముకుంటున్నారు కదా.. దాంతో పాటు చీకుల కొట్టు కూడా పెట్టుకోవాలంటూ ఆయన చురకలు వేశారు. ప్రజలు అధికారం ఇచ్చింది మటన్, చికెన్ షాపులు పెట్టడానికా... పాదయాత్రలో ప్రజలకు చెప్పింది ఇదేనా అంటూ పవన్ ప్రశ్నించారు.