Janasena : భీమవరంలో మోడీ సభకు అందుకే వెళ్లలేదు.. విమర్శలకు తెరదించిన పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ పాలన ఎమర్జెన్సీ కంటే దారుణంగా వుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం భీమవరంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నోరు ఎత్తితే కేసు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ అరెస్టులు.. బలంగా మాట్లాడితే బూతులు... నిరసనకు దిగితే దాడులు.. ఇదేమిటని అడిగితే హత్యలు అన్నట్లు వైసీపీ అరాచక పాలన సాగుతోందని ఆయన అన్నారు. ప్రస్తుత పాలన ఎమర్జెన్సీ కాలం నాటి పాలన కంటే దారుణంగా ఉందని.. ఎంతటి నియంతృత్వం ఎక్కడ ఎప్పుడు చూడలేదని పవన్ దుయ్యబట్టారు.
దళితుల మీదే అట్రాసిటీ కేసులు:
దళితుల మీద సైతం ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి వ్యవస్థలను దిగజారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా విభేదించే వారి సినిమాలను నియంత్రించేందుకు వ్యవస్థలు పనిచేస్తాయి తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేయకుండా చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు మనలో ఉందని... కళ్లెదుట ఇంత జరుగుతున్నా గొంతెత్తకుండా ఉంటే కచ్చితంగా మనకు మనమే ద్రోహం చేసుకున్నట్లని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిదానికి భయపడి కూర్చుంటే పనులు జరగవని... ఎంతో కొంత వ్యక్తిగతంగా నష్టపోయినా, ఈ దుర్మార్గాలను గట్టిగా ప్రశ్నిద్దామని.. బలంగా పోరాడుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఒక వ్యక్తి కోసం సొంత కులాన్ని తిడుతున్నారు:
తాను కులాల ఐక్యత మీద బలంగా మాట్లాడే వ్యక్తినని.. మన రాష్ట్రంలో ఆంధ్ర భావన పూర్తిగా పోతే, బలంగా ఉండే కుల భావన కూడా చాలా విచిత్రంగా అనిపిస్తోందన్నారు. తమ సొంత కులాన్ని తిడుతూ, వేరే వ్యక్తి ప్రాపకం కోసం పాకులాడుతున్నారని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్కడి కోసం తమ సొంత కులాలను కూడా తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అది చేసాం, ఇది చేసామని చెబుతున్న వైసీపీ నాయకత్వం తెలంగాణలో గుర్తింపుకు నోచుకొని 18 బీసీ కులాల పరిస్థితి మీద ఎందుకు మాట్లాడదన్నారు. ప్రతిసారి పక్కనే ఉన్న రాష్ట్రం ముఖ్యమంత్రితో ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడరు.? మాట వినని దళిత నేతలను వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత సామాజిక వర్గం నేతలకు వేధింపులు:
ఎందుకు పనికిరాని నిధులు లేని బీసీ కార్పొరేషన్లు పెట్టి ఊదరగొడుతున్నారని... పోనీ సొంత సామాజిక వర్గమైన వారిని ఐనా వదులుతున్నారంటే అది లేదన్నారు. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మా పార్టీ నేత మధుసూదన్ రెడ్డి వంటి వారిని కూడా వేధింపులకు గురి చేయడం వీరికి అలవాటయిందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడు అంటే అన్ని కులాలను కలుపుకొని వెళ్లేవాడని.. కొన్ని కులాలను వర్గ శత్రువులుగా ప్రకటించేవాడు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈయన చేసిన పనులకు సోషల్ మీడియాలో ఆయన కులాన్ని కొందరు తిడుతున్నారని.. అయితే రెడ్డి సామాజిక వర్గంలో ఎందరో మహానుభావులు, అద్భుతమైన వ్యక్తులు మనకు కనిపిస్తారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
అల్లూరి విగ్రహం పెట్టేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా:
27 ఏళ్ల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దాష్టికలు, దారుణాలపై బలంగా పోరాడారని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో పేరు గురించో, చరిత్ర గురించో ఆలోచించి ఆయన పోరాటం చేయలేదని పవన్ ప్రశంసించారు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహ నిర్మాణానికి ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎందుకు ముందుకు రావాలి..? ఇంతటి గొప్ప స్ఫూర్తిప్రదాత విగ్రహం ప్రభుత్వమే పెట్టొచ్చు కదా అని ఆయన నిలదీశారు. జనసేన ప్రభుత్వం వస్తే కచ్చితంగా జాతీయ నాయకుల విగ్రహాలను భావితరాలకు స్ఫూర్తివంతంగా ఉండేలా పెడతామని.. అల్లూరి లాంటి విశ్వనరుడు జనసేనకు స్ఫూర్తి ప్రదాత అన్నారు.
అందుకే ప్రధాని సభకు రాలేదు:
భీమవరంలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు స్థానిక నియోజకవర్గ ఎంపీను సైతం రాకుండా వైసీపీ అడ్డుకునే పరిస్థితి లో నేను రావడం సరికాదు అనే భావనలోనే రాలేదని పవన్ స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు మాపై గత ఎన్నికల్లో పోటీ చేశారని.. మాకు ఆయనకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా, ఒక పార్లమెంటు సభ్యుడుకి జరిగిన అవమానాన్ని సాటి మనిషిగా అర్థం చేసుకొన్నామని పవన్ చెప్పారు. ఆయనకి జరిగిన అవమానం క్షత్రియ సమాజానికి జరిగిన అవమానంగానే ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే:
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న పవన్ కల్యాణ్.. జనసేన పుట్టినప్పటి నుంచి జన క్షేత్రంలోనే తిరుగుతున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో అన్నను నమ్మారు... అదో భ్రమ అని తేలిందని సెటైర్లు వేశారు. రోడ్లమీద తిరిగిన వ్యక్తి ఎంతో మంచి చేస్తాడని అనుకున్నామని... రాగానే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డున పడేశాడని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. .సహజ సంపదలను దోచుకునే మార్గాలను ఎంచుకున్నాడని... ఒక్కసారి రాష్ట్రంలోని ప్రజలంతా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. అన్న వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించిన వారు సైతం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చిందని పవన్ గుర్తుచేశారు. కచ్చితంగా తాము ప్రజా పోరాటాలు చేస్తామని.. ప్రజలకు అద్భుత పరిపాలన అందించగల పటిష్టమైన ప్రణాళిక జనసేన వద్ద ఉందని ఆయన స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout