ఈసారి ఓట్లు చీలనివ్వను.. బీజేపీని ఒప్పిస్తా , చిన్న పదానికే భయమెందుకు : వైసీపీకి పవన్ చురకలు
- IndiaGlitz, [Saturday,May 21 2022]
వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే.. ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే యత్నం చేస్తానని పవన్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో వుంచుకునే ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు జనసేనాని వివరించారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో తమకు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
మంత్రి పదవులను తాము చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలంటూ చురకలు వేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. ఎక్కడ పోటీ చేసినా తనను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు జనసేనాని చెప్పారు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయన్న సంగతి.. తనను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని ఆయన ఎద్దేవా చేశారు.
తనను తిడితే పదవి కలకాలం నిలవదని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారని పవన్ కల్యాణ్ చురకలు వేశారు. సీపీఎస్ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్నారు. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలున్నపుడు.. సీపీఎస్ సమస్యను పరిష్కరించే తెలివి తేటలు ఉండవా అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ప్రజలకు దగ్గరయ్యే విధంగా తన యాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే అప్పుపుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి పూర్తి అవగాహన ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. 20 శాతం వున్న కాపుల ఓట్లను చాలా తేలిగ్గా చీల్చగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని.. కాపు సామాజిక వర్గం ఓటర్లు తమను రాజకీయంగా ఏం చేయలేరనే భావనలో ఆ పార్టీ వుందని ఆయన ఎద్దేవా చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ చాలా లైట్ తీసుకుందని.. అందుకే రిజర్వేషన్లు ఇవ్వలేమని సీఎం జగన్ చెప్పారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ముగించుకుని మంగళగిరి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా కరెంట్ పోయింది. దీంతో పవన్ కళ్యాణ్ సహా పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు. దీంతో సెల్‌ఫోన్ వెలుగులోనే పవన్ మీడియాతో మాట్లాడారు. ఆయన చీకటిలో మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.