Pawan Kalyan:జగన్ రౌడీ పిల్లాడు .. జగ్గూభాయ్‌కి భయపడొద్దు, నేను హ్యాండిల్ చేస్తా : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
వాలంటీర్ వ్యవస్థపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తానే కనుక వాలంటీర్లు వ్యవస్థను నడిపించి వుంటే ప్రతి గ్రామంలోని యువ శక్తిని తెలుసుకునే వాడినని చెప్పారు. యువత సామర్ధ్యాన్ని జగ్గూభాయ్ చంపేస్తున్నాడని .. వారిని తన సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నాడని పవన్ మండిపడ్డారు. జనసేన పార్టీ వాలంటీర్లకు వ్యతిరేకం కాదని.. కొందరు వాలంటీర్లు చేస్తున్న పనులే ఆమోదయోగ్యంగా లేవన్నారు. గతంలో వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు రాష్ట్రం నడవలేదా అని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ అంతిమ లక్ష్యం వైసీపీ కోసం పనిచేయడమేనని ఆయన ఆరోపించారు. కమిట్మెంట్ వుంది కాబట్టే ప్రధాని మోడీ.. తను ముఖ్యమంత్రితో సమానంగా పిలుస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. మోడీతో ఏం మాట్లాడానో చెప్పాలని వైసీపీ నేతలు అడుగుతూ వుంటారని.. అది వాళ్లకెందుకని దుయ్యబట్టారు.
అరాచకత్వాన్ని జగన్ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు :
జగన్ చిన్న రౌడీ పిల్లాడని.. జగ్గుభాయ్‌ని, అతని గ్యాంగ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో జనసేనకు తెలుసునని పవన్ స్పష్టం చేశారు. నేల , నీరు, గనులను జగన్‌కు వాళ్ల నాన్న వారసత్వంగా ఇవ్వలేదని.. అది అందరి సొత్తని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి చిన్న పనికి చేయి తడపాల్సి వస్తోందని .. అడ్డగోలుగా దోచేసే ఈ వైసీపీ నాయకులను ఎదుర్కోవడమే జనసేన లక్ష్యమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సుగాలి ప్రీతి తల్లి చేస్తున్న పోరాటానికి అండగా నిలిచానని.. జనసేన ప్రభుత్వం రాగానే ఆమెకు న్యాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. జగన్ తన పాలనలో అవినీతిని, అరాచకత్వాన్ని తీవ్ర దశకు తీసుకెళ్లారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న జలగ జగన్ అని.. ఆయన మీదే ఇప్పుడు పోరాడుతున్నామని పవన్ తెలిపారు. బతికే హక్కును భగవంతుడు ఇచ్చాడని.. దానిని ఎవరు హరించినా పోరాటం చేసే హక్కు మనిషికి వుందని జనసేనాని స్పష్టం చేశారు.
పార్టీ నడపటం అంత తేలిక కాదు :
వైఎస్ షర్మిల పార్టీ పెడితే మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపానని.. ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బిడ్డలైనా, వేల కోట్లు వున్నా పార్టీ నడపటం కష్టమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనకే పుట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారి ఇప్పుడు భారతదేశం కోసం పనిచేసేలా ఐడియాలజీని మార్చుకుందని పవన్ వెల్లడించారు. జనసేన పార్టీకి చెందిన ఏడు మూల సిద్ధాంతాలు చాలా బలమైనవని.. భవిష్యత్తులో అవి భారతదేశ రాజకీయాలను నిర్దేశిస్తాయని పవన్ పేర్కొన్నారు.
పాలన చేతకాని దద్దమ్మ జగన్ : నాదెండ్ల మనోహర్:
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మన కార్యక్రమాలకు వస్తున్న జనాలను, వారి నిబద్ధతను చూసి తట్టుకోలేక సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. ఇది జనసేన కాదు రౌడీ సేన అన్నారని గుర్తుచేశారు. ఇది ఏ సేనో జగన్‌కి చూపిద్దామని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. పరిపాలన చేతకాని దద్దమ్మ జగన్ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో వున్న పార్క్ స్థలానికి టీడీఆర్ బాండ్లు సృష్టించి దోచుకునే ప్రయత్నం చేశారని మనోహర్ ఆరోపించారు. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తండ్రిలా పాలిస్తాడని అనుకుంటే .. వీళ్లలు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని నాదెండ్ల దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఈ ముఖ్యమంత్రి కనీసం ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదని .. ఎక్కడ మీడియా మిత్రులు ప్రశ్నలు అడుగుతారోనని ఆయనకు భయమన్నారు. చివరికి టిడ్కో ఇళ్లకు కేటాయించిన భూములను అమ్మేయాలని తీర్మానం చేశారని.. నాలుగున్నరేళ్లుగా రాజధాని లేకుండా చేశారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చేస్తున్న మోసాలను పవన్ లెక్కలతో సహా వివరిస్తున్నారని మనోహర్ తెలిపారు. జనం కోసం నిలబడి ప్రతి గ్రామంలోనూ జనసేన జెండా ఎగురవేయాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments