Pawan Kalyan : ఇకపై జగన్‌ను ‘‘నువ్వు’’ అనే పిలుస్తా .. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏలూరులో జరిగిన వారాహి విజయయాత్ర బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డిపై వాడి వేడి విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ ఎక్కడి నుంచో ఊడిపడలేదని, మనలో ఒకడని, మనం కట్టిన పన్నులకు ధర్మకర్తగా వుండాలని బాధ్యతలు అప్పగించామన్నారు. ప్రజలు ఆయనకు బానిసలు కాదని.. నియంత పాలనలో ప్రజలంతా చెప్పినట్లు వినే పాలేర్లు కాదన్నారు. రూ.10 లక్షల కోట్ల బడ్జెట్‌కు జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యతను జగన్ విస్మరించారని పవన్ మండిపడ్డారు. ప్రజలకు తెలియకుండా రూ.1.18 లక్షల కోట్లు అప్పులు చేసి.. లెక్కలు కూడా సరిగా చెప్పని జగన్ సీఎం పదవికి అనర్హుడన్నారు. ఆయన మీద కాస్త గౌరవం వుండేదని.. అందుకే గారు అని సంభోదించేవాడినని.. కానీ సీఎం మీద అసహ్యం వేస్తోందని అందుకే ఇక నుంచి ఆయనను ఏకవచనంతోనే సంబోధిస్తానని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ అంకెల గారడీపై కాగ్ మొట్టికాయలు :
హల్లో ఏపీ.. బైబై వైసీపీ అనే నినాదం కేవలం సరదాగా ఇచ్చినది కాదన్నారు. వైసీపీ ప్రభుత్వ అంకెల గారడి, లెక్కలను చూసి కాగ్ షాకైందని.. దాదాపు 25 లోపాలను ఎత్తిచూపిందని పవన్ తెలిపారు. అప్పులు చేసి ఆ మొత్తాన్ని సంక్షేమ పథకాలకు మళ్లించిన బాగోతాలను కాగ్ బయటపెట్టిందని జనసేనాని వెల్లడించారు. కాగ్ చెప్పిన లెక్కల ప్రకారం రూ.1.18 లక్షల కోట్లను వైసీపీ ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌లో చూపించలేదన్నారు. ఇంటి పెద్దగా వున్న వ్యక్తి ఇంట్లోని వాళ్లకు తెలియకుండా అప్పులు చేశాడని.. మరి డబ్బంతా ఏం చేశారో జగన్ సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం పలు సంస్థలు, కార్పోరేషన్ల పేరు చెప్పి విచ్చలవిడిగా అప్పులు చేసిందని.. మరి ఆ సొమ్మంతా ఏమైందని జనసేనాని ప్రశ్నించారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ట్రెజరీకి లెక్క చెప్పకుండా రూ.11,237 కోట్లను పక్కదోవ పట్టించారని.. వీటికి లెక్కలు, పత్రాలు సమర్పించలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ధరల స్థీరీకరణ, రైతు పెన్షన్ కానుక , ఆసుపత్రుల బాగు, వికలాంగుల శాఖకు కేటాయించిన కోట్లాది రూపాయలు ఓటు పోయాయని ఆయన ప్రశ్నించారు.
నా తల్లిని , భార్యను తిడుతున్నారు :
వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తున్నానని.. తన తల్లిని, తన భార్య, ఇంట్లోని పిల్లలను సైతం మాటల్లో చెప్పలేని భాషలో తిడుతున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏలూరు నగరపాలక సంస్థలో జరిగిన అవినీతిపై ఐఏఎస్ అరుణ్ బాబు ఇచ్చిన నివేదికపై ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. నగరంలో 300 మందికి వింత వ్యాధి సోకితే అనారోగ్యం పాలైతే దానికి కారణాలు, నివేదికలను బయటపెట్టలేదని పవన్ దుయ్యబట్టారు. నగరవాసుల కల అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఏళ్లు గడుస్తున్నా మోక్షం లేదన్నారు. బుగ్గలు నిమిరి, ముద్దులు పెట్టే వారిని నమ్మొ మోసపోవద్దని జగన్‌పై పవన్ సెటైర్లు వేశారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం జనసేన కట్టుబడి వుందన్నారు.
మద్యం విక్రయాల ద్వారా లక్ష కోట్లు :
కొల్లేరు పరిరక్షణకు కట్టుబడి వున్నామని.. సరస్సుకు పునర్వైభవాన్ని తీసుకొస్తామని పవన్ స్పష్టం చేశారు. కొల్లేరు ముంపులో 75 గ్రామాలు మునిగిపోతున్నాయని, గతంలో 3 శాతం ఉప్పగా వుండే కొల్లేరులో ఇప్పుడు 12 శాతం ఉప్పు లవణాలు కనిపించడం ప్రమాదకరమన్నారు. ఓ వైపు రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోతుంటే.. వైసీపీ నేతలు వందల కోట్లకు పడగలెత్తుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి మద్యం మీదనే రూ.1.25 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడని ఆయన ఆరోపించారు. దీనిలో రూ.97 వేల కోట్లకే లెక్కలు చెప్పి.. మిగిలిన రూ. 30 వేల కోట్లను దోచేశాడన్నారు. కల్తీ మద్యం తాగి జంగారెడ్డి గూడెంలో 32 మంది చనిపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పరదాల చాటున దాక్కొనే మహారాణి ఈ సీఎం :
వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో జగన్ ఎప్పుడైనా ఒక్క ప్రెస్ మీట్ పెట్టారా అని పవన్ ప్రశ్నించారు. ఆయనకు టీవీలో మాట్లాడాలంటే వణుకని, ఆయన పాలనా లోపాలు ఎక్కడక బయటకొస్తాయోనని భయమన్నారు. బహిరంగ సభలకు వెళ్లినా మహారాణిలా పరదాల మాటున దాక్కొని వెళ్తారని పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ప్రభుత్వ జీవోలను జగన్ రహస్యంగా వుంచుతున్నారని.. వైసీపీ పోయాక ఆ జీవోలన్నీ బహిర్గతం చేస్తామని ఆయన తెలిపారు. చివరికి అనాధలకు దహన సంస్కారాలు నిర్వహించే వారిపైనా జగన్ ప్రభుత్వం దాడి చేసిందని.. ప్లాష్ సంస్థకు చెందిన ఫ్రీజర్ బాక్సులు భద్రం చేసే గోదాంను కూలగొట్టిందన్నారు.
ఆడపిల్లల అక్రమ రవాణా వెనుక వైసీపీ హస్తం:
వైసీపీ అధికారంలోకి వచ్చాక 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని.. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి వుందని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ఈ స్థాయిలో మానవ అక్రమ రవాణా జరగడానికి కారణం గ్రామ వాలంటీర్లేనని ఆయన ఆరోపించారు. వీరు సేకరిస్తున్న సమాచారం కొన్ని అసాంఘిక వర్గాలకు చేరుతోందన్నారు. ఒంటరి మహిళల సమాచారం సంఘ విద్రోహ శక్తులకు చేరడం వల్లనే ఈ ఘోరం జరిగిందన్నారు. దారి దోపిడి చేసే దొంగలకు, చెత్త పన్నుతో సహా అన్ని రకాల పన్నులను వేసి జనాన్ని దోపిడీ చేసే జగన్‌కు తేడా లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్‌కు విలువలు లేవని, ఆయనో క్రిమినల్ అని జనసేనాని వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments