Janasena President :మనకేం మైనింగ్‌లు, ఇసుక దోపిడీలు లేవు.. సినిమాలు తీసి పార్టీని నడుపుతున్నా : పవన్ కళ్యాణ్
- IndiaGlitz, [Sunday,June 25 2023]
మనకు ఇసుక, మైనింగ్ దోపిడీ వల్ల వేలకోట్లు రావని, మన డబ్బు మనమే సంపాధించుకోవాలి అందుకే సినిమాలు చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. శనివారం పి.గన్నవరానికి చెందిన పార్టీ నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఆక్వా పరిశ్రమ వల్ల భూగర్భ జలాలు నాశమైపోతున్నాయని, తాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ నుంచి ఒ.ఎన్.జి.సి, గెయిల్, రిలయన్స్, వేదాంత ఇలా అనేక ఆయిల్ కంపెనీలు ఇక్కడ నుంచి చమురు నిక్షేపాలను తరలిస్తున్నాయన్నారు. పైప్ లైన్ లీకులు వల్ల బ్లో అవుట్లు జరిగి వాతావరణం కలుషితమవ్వడమే కాకుండా ప్రజలు మృత్యువాత పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ కంపెనీలు తమ లాభాల్లో 2 శాతం వాటాను ఇక్కడి ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరూ కలిసి జనసేన గెలుపుకు కృషి చేయాలి తప్పించి వర్గాల పోరులో పార్టీ ఓడిపోకూడదని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన గెలుపు ప్రజల గెలుపని అది గుర్తు పెట్టుకొని నాయకులు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నేరం చేసింది ఏ కులం వాడైనా శిక్ష పడాల్సిందే :
ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశాడని.. చట్టాలు బలంగా పనిచేసి వుంటే ఆయనను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని కానీ అలా జరగలేదన్నారు. అనంతబాబు అరెస్టు కాకుండా ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ఆశ్రయం ఇచ్చాడని పవన్ కల్యాణ్ ఆరోపించారు. చంపిన వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా సరే శిక్ష పడాలని ఆయన కోరారు. ఈ ప్రభుత్వం రౌడీలు , గుండాలను వెనకేసుకొస్తోందని.. మనం మేల్కోపోతే ఇబ్బందిపడతామన్నారు. ప్రజలకు ముందు సత్యాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటే రాజోలులో తనపై రాళ్ల దాడి చేయడానికి ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి ప్రయత్నించారంటే సమాజంలో మార్పు మొదలైందని అర్థమని ఆయన అభివర్ణించారు.
నేను కదలలాంటే 400 మంది సిబ్బంది కదలాలి :
రాజమండ్రిలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించామని.. పిఠాపురం, అమలాపురం, రాజోలు, పి గన్నవరంలలో కూడా త్వరలోనే పార్టీ కార్యాలయాలు ప్రారంభించబోతున్నామని పవన్ తెలిపారు. మండల, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క నాయకుడిని కలుస్తానని .. కానీ తాను కదలాలంటే దాదాపు 400 మంది సిబ్బంది కదలాలి, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్నారు. వైసీపీలా నియోజకవర్గానికి రూ. 25 లక్షలు ఖర్చు చెయ్ అని మన నాయకులకు తాను చెప్పనని పవన్ పేర్కొన్నారు.