Janasena President:ఎకరాకొక బియ్యం బస్తా ద్వారంపూడి ఇంటికే.. ఏపీని వైసీపీ తెల్ల దోమ తెగులులా పీడిస్తోంది : పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Thursday,June 22 2023]

రైతు సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ ఆశ చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాన్ని నెరవేర్చలేకపోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 7 శాతం వడ్డీలో రాష్ట్ర వాటా 4 శాతంను ప్రభుత్వం చెల్లించలేదని, ఫలితంగా రియంబర్సుమెంటు రైతులకు అందలేదన్నారు. రూ.6,300 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఏ పని జరగడం లేదన్నారు. కనీసం సిబ్బంది కూడా అందుబాటులో ఉండటం లేదని.. వ్యవసాయ బీమా కడతామని చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ధాన్యం తరలించే రైసు మిల్లులు దూరంగా ఉంటున్నాయని.. రైతులను కష్టపెట్టాలనే భావనతోనే వీటిని కేటాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతూ ఆనందం పొందుతున్నారని పవన్ దుయ్యబట్టారు. తనకు వ్యవసాయం మీద పూర్తి అవగాహన ఉందని.. ఇటీవల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించిన వెంటనే వారికి సహాయం అందిందని గుర్తుచేశారు. జనసేన ప్రభుత్వంలో రైతులకు మేలు చేసే నిర్ణయాలుంటాయని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

రైతుల కన్నీటి మీద ద్వారంపూడి కోట్లు సంపాదిస్తున్నాడు :

రాష్ట్రానికి తెల్లదోమలా వైసీపీ తయారైందని.. రైతులను అన్ని విధాలా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగు చేస్తున్న ప్రతి ఎకరా నుంచి ఓ బస్తా ద్వారంపూడి కుటుంబానికి వెళ్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రైతు కుటుంబాల కన్నీటి మీద ద్వారంపూడి కుటుంబం వ్యాపారం చేస్తోందని.. కష్టం రైతులదైతే దానిని అమ్ముకొని అధికారం చెలాయిస్తోంది మాత్రం ద్వారంపూడి కుటుంబమేనని వ్యాఖ్యానించారు. అధికారం మీరు అనుభవిస్తూ రైతులను అంధకారంలోకి నెట్టేస్తున్నారని, రైతు కన్నీరు మంచిది కాదని పవన్ హెచ్చరించారు. అనేక సమస్యలతో కోనసీమ రైతులు ఖరీఫ్ లో 50 వేలు నుంచి 60 వేల ఎకరాల్లో పంట విరామం ప్రకటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నేనొస్తున్నానని ధాన్యం కొన్నారు :

కాలువల్లో పూడికలు తీయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని.. మొన్న కురిసిన అకాల వర్షాలకు ధాన్యం రంగు మారిపోయిందని, కొన్ని చోట్ల మొలకలు కూడా వచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారన్నారు. అన్నం పెట్టే అన్నదాతకు అండగా ఉండాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించానని.. తాను వస్తున్నానని తెలియగానే ప్రభుత్వ అధికారులు రాత్రికి రాత్రే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రశ్నించేవాడు, పోరాటం చేసేవాడంటే ఈ ప్రభుత్వానికి భయమని, ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూస్తే.. మీకు అండగా నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు.

ఇసుక దోపిడీకి అడ్డూ అదుపూ లేదు :

నియోజకవర్గంలో ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారని.. నదిలో యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. యంత్రాలు చేసిన గుంతల్లో కార్తీక మాసం పూజలు చేసుకునే భక్తులు పడి మృత్యువాత పడుతున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ ఇసుక దోపిడీని అరికట్టలేకపోతున్నాయని రాష్ట్రంలో ఇసుక మొత్తాన్ని ముగ్గురు దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని ఒక కుటుంబం, లక్షల మంది కష్టార్జితాన్ని మరో కుటుంబం ఇలా ఒకరిద్దరు దోచుకుంటే ఆ దోపిడీ వ్యవస్థపై తాను ఖచ్చితంగా పోరాటం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకు పెద్దపీట వేస్తామని.. ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పున యువతను గుర్తించి వారికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. వాళ్లు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి పదిమందికి ఉపాధి కల్పించేలా ప్రోత్సహిస్తామన్నారు.