హర్ట్ అయిన పవన్.. బీజేపీతో జనసేన కటీఫ్!?

  • IndiaGlitz, [Saturday,February 15 2020]

బీజేపీతో కటీఫ్ కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారా..? బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నప్పటికీ తనకు ప్రాధన్యత ఇవ్వకపోవడంతో పవన్ హర్టయ్యారా..? అందుకే గ్లాస్‌లో నుంచి కమలాన్ని తీసేయాలని భావిస్తున్నారా..? అంటే తాజాగా ఏపీలో.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి!
2019 ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన పవన్ కల్యాణ్.. 2024 ఎన్నికలకు ముందు ప్రణాళికలు రచించాలని.. అది కూడా జాతీయ పార్టీ అయిన బీజేపీతో అయితే బాగుంటుందని ఏరికోరి మరీ తనకు తానుగా వెళ్లి ఢిల్లీలో కమలనాథులను కలవడం.. అనంతరం బీజేపీతో కలిసి పనిచేస్తానని పవనే ప్రకటించడంతో రానున్న ఎన్నికల్లో రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చు కానీ.. కాస్తో కూస్తో కచ్చితంగా బలపడతామని ఇటు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు.. అటు అంతంత మాత్రమే ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎన్నో ఎన్నెన్నో కలలు కన్నారు. అయితే వచ్చే ఎన్నికలు కాదు కదా.. నెలల వ్యవధిలోనే ఆ మైత్రి కటీఫ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తే కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి’ అనేలా పరిస్థితి మారిందన్న మాట.

బీజేపీ నేతలే ఇలా చేస్తే ఎలా!?
బీజేపీతో జనసేన కలిసి నడవాలనుకున్న పవన్‌కు కమలనాథులే అడుగడుగా బ్రేక్‌లు వేస్తూ వచ్చారట. అటు ఢిల్లీకెళితే ఎంపీ జీవీఎల్ నర్సింహారావు.. ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, పురందేశ్వరీలే కీలకంగా మారి.. పవన్‌ను పట్టించుకోవట్లేదట. మరీ ముఖ్యంగా ఢిల్లీకెళ్లినప్పుడు మొదట పవన్ ఏం మాట్లాడినా మరీ ముఖ్యంగా ‘నవ్యాంధ్రకు మూడు రాజధానులు’ పవన్ మాట్లాడితే.. ఆ తర్వాత మాట్లాడిన జీవీఎల్ మాత్రం.. అబ్బే అదేం లేదు.. అంతా రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని చెప్పడంతో జనసేనాని కంగుతిన్నాడట. ఇక ఏపీ విషయానికొస్తే.. బీజేపీ నేతలు ఉన్నది అంతంత మాత్రమే.. వాళ్లు కూడా పవన్‌కు సరిగ్గా సహకరించట్లేదట. కనీసం ఆయన చేపట్టే కార్యక్రమాలకు తోడ్పాటు కూడా ఇవ్వకపోవడంతో పవన్ ఇక చేసేదేమీ లేదని బయటికొచ్చేయాలని భావిస్తున్నాడట.

జగన్‌ దెబ్బకు వెనక్కి!?
వాస్తవానికి రాష్ట్రంలో అధికారంలో ఉండే పార్టీతో కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకైనా అవసరాలుంటాయ్. అంతే రీతిన కేంద్ర ప్రభుత్వంతో.. రాష్ట్ర ప్రభుత్వంతో అంతే రీతిలో అవసరాలుంటాయ్.. ఈ విషయం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్య సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నారట. అంతేకాదు.. అవసరమైతే.. ఎన్టీయే చేరాలని.. ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా ఇప్పించే యోచనలో జగన్ ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే జరిగితే పవన్‌కు మైత్రిలో గడ్డురోజులే!. అంటే అప్పుడు బీజేపీతో జనసేన కటీఫ్.. బీజేపీ-వైసీపీ మైత్రి అన్న మాట. అంతేకాదు.. ఇప్పటికే ప్రధాని మోదీతో జగన్ భేటీ కావడం.. ఆ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఇలా సీఎంకే ప్రాధానత్యత ఇవ్వటం.. కనీసం తనను పట్టించుకోవడంతో పవన్‌కు మింగునపడట్లేదట.

మొత్తానికి చూస్తే.. పవన్ మాత్రం బీజేపీ నుంచి బయటికి రావాలని తన పార్టీ నేతలతో చర్చించి కటీఫ్ కావాలని భావిస్తున్నాడట. మరి బీజేపీతో కటీఫ్ తర్వాత పవన్ ఏ పార్టీతో కలిసి పయనిస్తాడు? లేకుంటే మళ్లీ టీడీపీతోనే కలుస్తాడా..? అదీ కూడా కాకపోతే ఒంటరిగానే రంగంలోకి దిగుతాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి పవన్ మనసులో ఏముందో.. ఎవరికేం ఎరుక.!