సీమలో ఈ ఎంపీ సీటుపైనే జనసేన ఆశలు!?
Send us your feedback to audioarticles@vaarta.com
2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్, బీఎస్పీ పార్టీలతో కలిసి ముందుకెళ్తున్న జనసేన తన సత్తా ఏంటో అధికార, ప్రతిపక్షపార్టీకి రుచి చూపించడానికి సిద్ధమైంది. కోస్తా ఆంధ్రలో జనసేన పరిస్థితి ఎలా ఉందనే విషయం పక్కనెడితే రాయలసీమలో మాత్రం అంతంత మాత్రమే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏ పార్లమెంట్ స్థానంలో బాగా స్ట్రాంగ్‌గా ఉందనే విషయానికొస్తే రాయలసీమ మొత్తమ్మీద ఒకే ఒక్క నంద్యాల స్థానమే. ఎందుకంటే.. మిగిలిన ప్రాంతాల్లో చాలా వరకు అటు టీడీపీకి.. ఇటు వైసీపీకి కంచుకోటలే. అయితే అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఓట్లు కాస్త చీల్చొచ్చేమోగానీ గెలిచే పరిస్థితులు లేవంటూ విశ్లేషకులు చెబుతున్న మాట.
నంద్యాలే ఎందుకంటే..?
రాయలసీమలో పెద్ద పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఆయన.. ఫలితాలు వెలువడిన కొద్దిరోజులకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆశించిన టికెట్లు అధిష్టానం ఇవ్వకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీలోకి రావడంతో కచ్చితంగా నంద్యాల పార్లమెంట్ తమదేనని అధిష్టానం అప్పుడే భావించింది. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో జనసేన తరఫున రెడ్డి గెలవబోతున్నారంటూ ఇప్పటికే పార్టీ చేయించుకున్న పలు అంతర్గత సర్వేల్లో తేలిందట. దీంతో తమ పార్టీ గొంతుక పార్లమెంట్లో వినిపించేందుకు మార్గం దొరికిందని అధిష్టానం అనుకుంటోందట.
ఇదీ లెక్క..?
గత ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఓట్లేస్తేనే భారీ మెజార్టీతో ఎస్పీవై రెడ్డి గెలిచిపోయారు. అయితే ఆయన టీడీపీ ఆ తర్వాత జనసేన పార్టీలోకి మారినప్పటికీ ఆయన అభిమానులు, కార్యకర్తలంతా ఆయన వెంటే ఉన్నారనే గట్టి నమ్మకంతో పార్టీ ఉంది. గతంతో పోలిస్తే ఈసారి జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా తోడవుతారని దీంతో 2014 మెజార్టీ రాకపోయినా కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన వల్ల ఓట్లు చీలుతాయే తప్ప మాకు ఎలాంటి నష్టం లేదని కచ్చితంగా మా కేడర్ మొత్తం మాతో ఉందని వైసీపీ చెబుతోంది. మరోవైపు టీడీపీ మాత్రం మేం చేసిన అభివృద్ధే మా అభ్యర్థులను గెలిపిస్తుందని టీడీపీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇరు పార్టీల ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ నియోజకవర్గానికి కొత్త కావడంతో ఇది కూడా తమకు కలిసొస్తుందని జనసేన భావిస్తోంది. అయితే నంద్యాలలో ఏ పార్టీ జెండా ఎగురుగుతుందో తెలియాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments