Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ఎన్నికల ప్రచారం నిలిపివేత..

  • IndiaGlitz, [Wednesday,April 03 2024]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం తెనాలిలో జరగాల్సిన ర్యాలీ, సభను రద్దు చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు ట్వీట్ చేసింది. దీంతో హైదరాబాద్‌లో రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎప్పుడు ప్రచారం నిర్వహించే దానిపై త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండు, మూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు అంటూ పేర్కొంది.

వారాహి విజయభేరి పేరుతో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిరోజు చేబ్రోలు మండలంలో బహిరం సభ నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం స్థానికులు, మేధావును కలిసి ప్రచారం చేశారు. ఇక మంగళవారం నియోజకవర్గంలోని యు. కొత్తపల్లి, పిఠాపురం రూరల్ మండలాల్లో పర్యటించారు. సుమారు 20 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన పవన్ కళ్యాణ్.. మహిళలు, రైతులు, యువతను పలకరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎండలోనే ప్రచారం నిర్వహించడంతో అస్వస్థతకు గురైనట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

కాగా తొలి విడత ప్రచారంలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ప్రచారం చేయనున్నట్లు షెడ్యూల్ రూపొందించారు. పిఠాపురం, తెనాలి నియోజకవర్గాలతో పాటు జనసేన అభ్యర్థులు ఉత్తరాంధ్రలో పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు జ్వరం బారిన పడటంతో త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటించనున్నారు.